రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు
- ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా ?
- తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా ?
- నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా ?
- గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు !
- అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే
- వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే
- ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం
- మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు
- మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా ?
- ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే !
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 12 (విశ్వం న్యూస్) : గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు…
సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన మీ కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్థిత్వాన్ని కూడా దెబ్బతీస్తోంది. చేతకాని, మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది మీరు చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోంది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎన్నికల టైంలో మీరు ఊరురా తిరిగి ఊదరగొట్టిన గ్యారెంటీలన్నీ గారడీలేనని మీ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయింది. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయింది. మేనిఫెస్టోలో మీరిచ్చిన 420 హామీలు.. కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్ లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాదిపాటు పత్తా లేకుండా పోయిన మీకు, మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయింది. ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ, మీరు ప్రజలకు మీరిచ్చిన మాటపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేంటి.
ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా.. మోసం మీ నైజం.. అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని అడుగడుగునా తేల్చిచెప్పారు. మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకుచిత్రం ఛిద్రమవుతుంటే మీరు ప్రేక్షకపాత్రకే పరిమితమైన వ్యవహారంపై ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశానికే వెన్నుముక అయిన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీది. కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటిమూటే అయ్యింది. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా నాలుగు విడతలుగా ఊరించి ఊరించి ఉసూరుమనిపించడంతో.. ఇప్పటికే దాదాపు 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేదు.. కాంగ్రెస్ సర్కారులో కనీస మానవత్వం లేదు.
బీఆర్ఎస్ హయాంలో అప్రతిహతంగా కొనసాగిన పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ రాగానే బ్రేకులు వేశారు. బీఆర్ఎస్ సిద్ధం చేసిన రైతుబంధు నిధులను ఒకసారి విడుదల చేశారే తప్ప.. ఏడాదైనా మీరు చెప్పిన రైతుభరోసాను అసలు మొదలే పెట్టలేదు. వానాకాలం సీజన్ లో పెట్టుబడి సాయాన్ని మొత్తానికే ఎగ్గొట్టి రైతాంగాన్ని నిలువునా ముంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కౌలు రైతులకు కూడా రైతుభరోసా కింద 15 వేలు, రైతు కూలీలకు 12 వేల చొప్పున ఇస్తామన్న హామీకి ఏడాదైనా అతీ గతీ లేదు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మబలికి, తీరా గద్దెనెక్కాక సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కిన మీ సన్నాసి ప్రభుత్వ నిజస్వరూపాన్ని రైతులు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేల్చి చెప్పారు. బోనస్ మాట దేవుడెరుగు కనీసం పంట కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర లేక “సాగు” మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్లో చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సర్కారును చూసి అన్నదాతలు అసహ్యించుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ వేసి.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరిచ్చిన హామీ గంగలో కలిసిపోయింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమే. అంటే తెలంగాణ యువతకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాలా 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉందనే విషయాన్ని తెలంగాణ యువత మరిచిపోలేదు. యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని తెలంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. ఇక అశోక్ నగర్ లో నిరుద్యోగులతో ఫోటోలకు ఫోజులుకొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది.
ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. అరకొరగా నడిచిన ఫ్రీ బస్సు స్కీమ్ తప్ప మహిళలకు ఒరిగిన ప్రయోజనం ఒక్కటీ లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ .2500 హామీకి 365 రోజులు గడిచినా మోక్షం లేదు. నయా పైసా ఇచ్చే దిక్కులేదు కానీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మీ ఢిల్లీ పార్టీ చేసిన ప్రకటనలోని డొల్లతనాన్ని తెలంగాణ ఆడబిడ్డలు పసిగట్టేశారు. కల్యాణలక్ష్మి పథకానికి తోడు తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టి.. చివరికి అసలు పథకానికి కూడా ఎసరు పెట్టిన దగుల్బాజీ పాలన మీది. ఏడాది కాలంగా కల్యాణలక్మి సాయం అందని పేద తల్లిదండ్రులు కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతున్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లను 4 వేలకు పెంచుతామని, దివ్యాంగుల పించన్ ను 6 వేలు చేస్తామని ఇచ్చిన హామీ ఏడాదైనా అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలకు నిదర్శనం. ఇచ్చే పించన్లలో కూడా రెండు నెలలు ఎగ్గొట్టి నిరుపేదల నోటికాడి బుక్కను లాగేసుకున్న కాంగ్రెస్ సర్కారుకు వారి పాపం తగలక మానదు.
హైడ్రా పేరిట హంగామా సృష్టించి నిరుపేదలకు నిలువ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట మీ లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ ప్లాన్ కూడా బట్టబయలైంది. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా కూడా, ఈ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు టార్గెట్ పెట్టడం మూసీలో మీ మూటల వేటకేనని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారు.
కనికరం లేని ముఖ్యమంత్రి ఆదేశాలతో.. కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలకు కేరాఫ్ గా మారితే.. ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న తెలంగాణ భవన్.. జనతా గ్యారేజీగా మారింది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. కన్నీళ్లొచ్చినా బాధితులు తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకుని హైడ్రా, మూసీ బాధితుల వరకూ అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడే రక్షణ కవచం.. తెలంగాణ భవన్ అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది.
ఓవైపు కూల్చివేతలే కాదు.. బూటకపు ఎన్ కౌంటర్ల పేరిట కాల్చిచంపుతున్న కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి తెలంగాణలో అమలుచేయడం దిగ్ర్భాంతికరం. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలనా తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువుచేసింది.
ఓవైపు అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, మరోవైపు అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సొంత నియోజకవర్గం కొడంగల్ లో సీఎం బలంవంతంగా భూములు లాక్కునే కుట్రను దళిత, గిరిజన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఎండగట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసికొట్టిందనే కక్షతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రాన్ని తెరపైకి తెచ్చి పచ్చని భూముల్లో చిచ్చుపెట్టే పన్నాగాలను ప్రజలు మరోసారి తిప్పికొట్టడం ఖాయం.
అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీచేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించింది. సీఎం బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలుకుంటే.. 1100 కోట్ల పౌరసరఫరాల స్కామ్, మంత్రి పొంగులేటి కుమారిడికి అప్పజెప్పిన కొడంగల్ లిప్ట్ పనుల దాకా.. అడుగడుగునా వేల కోట్ల అవినీతే తాండవిచ్చింది. ఇక మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఏకంగా లక్షన్నర కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన స్కెచ్ ను చూసి యావత్ సమాజం నివ్వెరపోయింది. గోదావరి జలాలను మూసీకి తరలించే అంచనాలను 1100 కోట్ల నుంచి 5500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట. ఈ స్కాములే తాచుపాములై మీ కాంగ్రెస్ ను వెంటాడటం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నాను.
ఇక ఎప్పుడు చూసినా రాజ్యాంగ విలువలు వల్లెవేసే మీకు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి లబ్ది చేకూర్చిన సీఎంను తప్పించే దమ్ముందా అని తెలంగాణ సమాజం పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నా. ఓవైపు సీఎంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హక్కు కూడా లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ కు అధికారమిస్తే తెలంగాణకు అంధకారమేనని చేతల ద్వారా నిరూపించిన మీ పార్టీని చరిత్రే కాదు.. భవిష్యత్తు కూడా క్షమించదు.
ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తినింపిన తెలంగాణ తల్లి దివ్య, భవ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఒకప్పుడు బలిదేవత అని సోనియాగాంధీని తిట్టిపోసి, ఇప్పుడు చిల్లర పన్నాగాలకు తెరలేపాడు. తలరాతలు మారుస్తానని గద్దెనెక్కి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్థిత్వ ఆనవాళ్లను మార్చే కుటిల యత్నాలకు పాల్పడుతున్నాడు. ఈ నీచమైన, భావదారిద్ర్య చర్యలు భవిష్యత్తులో మీ పార్టీ మెడకే చుట్టుకోవడం ఖాయమని స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నాను. గత పదేళ్లు మేము తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాం తప్ప.. పనికి మాలిన ఆలోచనలు చేయలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పేర్లు మార్చలేదు, ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదు. కానీ మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపేసే దారుణ కుట్రకు తెరలేపాడు.
అందులో భాగంగానే కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ని అధికార చిహ్నం నుంచి తొలగించాడు. తాజాగా తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లిని తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దే కుట్ర చేశాడు. . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం-అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో తెలంగాణ సమాజం యావత్తు వ్యతిరేకించినా, మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టింపజేశాడు.
ఆత్మగౌరవం, స్వయంపాలన నినాదాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ విష సంస్కృతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు. సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన, కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం అని గుర్తుంచుకోండి. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అంటే గౌరవం ఉన్నప్పటికీ కేవలం రేవంత్ రెడ్డి చేసిన ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రతి స్పందనగా అసలైన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉన్నది.
ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ కు సకల మర్యాదలతో సాగనంపుతామని నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా స్పష్టంచేస్తున్నాను. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను మీ ముఖ్యమంత్రి ఇకనైనా మానుకుంటే మీకే మంచిది. చేతనైతే హామీలు అమలుచేయండి, లేదంటే తెలంగాణ ప్రజల ముందు లెంపలేసుకుని క్షమాపణలు కోరండి. అంతేకానీ, మేము పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు. మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు.