అత్యంత పకడ్బందీగా మద్యం టెండర్ల లక్కీ డ్రా

  • రాష్ట్రవ్యాప్తంగా 1,31,490 దరఖాస్తులు
  • అన్ని జిల్లా కలెక్టరేట్లలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీలు
  • టెండర్ల ప్రక్రియలు చిన్న తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు
  • ఇతర రాష్ట్రాలు, నకిలీ, విదేశాల నుంచి వచ్చే మద్యాన్ని కట్టడి చేయడం వల్ల భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
  • రేపు టెండర్ల లక్కీ డ్రాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించిన ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ఆగస్టు 20 (విశ్వం న్యూస్) : సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంతలేబిళ్ళ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదని… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటన్నిటినీ కట్టడి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ లక్కీ డ్రాకు సంబంధించిన ఏర్పాట్లపై మహబూబ్ నగర్ లోని తమ క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 131490 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తామని… గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారని మంత్రి వివరించారు. లైసెన్స్ దారులు, ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంతంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జోబుల్లోకి పోయేదని… నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు. అక్రమమద్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *