బతికున్న కొడుకుతో శ్మశానవాటికలో తల్లి ఆశ్రయం.. కన్నీళ్లు పెట్టించే దీనగాథ!

బతికున్న కొడుకుతో శ్మశానవాటికలో తల్లి ఆశ్రయం.. కన్నీళ్లు పెట్టించే దీనగాథ!

బతికున్న కొడుకుతో శ్మశానవాటికలో తల్లి ఆశ్రయం.. కన్నీళ్లు పెట్టించే దీనగాథ!

విశ్వం న్యూస్,వేములవాడ, 7 నవంబర్ 2026 : కన్న కొడుకును కాపాడుకోవడానికి ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు. ఉన్నదంతా వైద్యం కోసమే ఖర్చు చేసింది. అప్పులు చేసి మరీ బిడ్డకు చికిత్స చేయించింది. అయినా కుమారుడి ఆరోగ్యం మెరుగుపడలేదు. మరోవైపు ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఉండటానికి గూడు కూడా కరువైంది. దీంతో అనారోగ్యంతో ఉన్న కొడుకును తీసుకుని ఆ తల్లి శ్మశానవాటికలో ఆశ్రయం పొందాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. బిడ్డను కాపాడుకోవాలన్న తపన ఒకవైపు.. కనీసం తలదాచుకోవడానికి నీడ లేకపోవడం మరోవైపు.. ఆ తల్లి పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగుచూసిన ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కలచివేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృత గత ఐదేళ్లుగా వేములవాడ పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ తన కుమారుడు మర్రిపల్లి రాకేష్‌ను పోషించుకుంటున్నారు. అయితే కొంతకాలంగా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతడి వైద్యం కోసం ఇప్పటివరకు సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు అమృత తెలిపింది. బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశతో అప్పులు చేసి మరీ చికిత్స చేయించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

అయినప్పటికీ కుమారుడి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన కుమారుడికి కామెర్లతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కన్నీటిపర్యంతమైంది. వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు ఒకవైపు, రోజువారీ జీవనానికి ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు మరోవైపు ఆమెను మరింత కుంగదీస్తున్నాయి.

ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి రావడంతో తల్లీకొడుకులకు నిలువ నీడ లేకుండా పోయింది. చివరకు అనారోగ్యంతో ఉన్న కుమారుడిని వెంటబెట్టుకుని శ్మశానవాటికలో ఆశ్రయం పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చేస్తున్న పోరాటం, ఎదుర్కొంటున్న కష్టాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ దీనస్థితిని చూసిన స్థానికులు చలించిపోతున్నారు. తల్లీకొడుకులకు ప్రభుత్వం, దాతలు అండగా నిలిచి తగిన వైద్యం, వసతి కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *