కరీంనగర్ వాసులకు జాతీయ బంగారు నంది అవార్డుల ప్రధానం

తిమ్మాపూర్, జూన్ 9 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ బంగారు నంది అవార్డు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్. వల్లూరి ఫౌండేషన్, శ్రీ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, ఆచార్య దైవిజ్ఞ శర్మ, మల్కాజ్గిరి అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సినీ ప్రముఖులు దొరై స్వామి, దర్బార్ చంద్రశేఖర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కరీంనగర్ వాసుల్లో వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తున్న డా. ఎలగం దుల శ్రీనివాస్ (వాసుదేవ హాస్పిటల్ అధినేత), ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ విభాగంలో సేవలందిస్తున్న ఈద కుమారస్వామి, ప్రైవేట్ రంగ ఇంజనీరింగ్ విభాగంలో సేవలందిస్తున్న కోల అన్నారెడ్డిలను సహా వివిధ రంగాలలో కృషిచేసిన పలువురు నిష్ణాతులను జాతీయ బంగారు నంది అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తానా అసోసియేషన్ ప్రతినిధులు, వైద్యులు, ఇతర ప్రముఖులు అవార్డు గ్రహీతలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు శ్రీ ఫౌండేషన్, జి.సి.ఎస్ వల్లూరి ఫౌండేషన్, శ్రీ ప్రగతి ఫౌండేషన్ సభ్యులు సమన్వయం అందించారు.