పూలే ఆశయ సాధకుడు మన
సీఎం కేసీఆర్:మంత్రి గంగుల

- సూర్య చంద్రులున్నంత వరకూ మహాత్మా పూలే నిలిచి ఉంటారు
- రవీంద్రభారతిలో ఘనంగా మహాత్మా జ్యోతిభాపూలే 197వ జయంతి వేడుకలు
- హాజరైన మంత్రులు, బీసీ సంఘాలు, ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తన ప్రజలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : మహాత్మా జ్యోతిభాపూలే ఆశయాలను ఆచరణాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుని 197వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో నేడు ఘనంగా నిర్వహించింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండాప్రకాష్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంఘాల నేతలు, పూలే అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మహాత్మాజ్యోతిభాపూలేకు ఘనంగా నివాళులర్పించారు మంత్రి గంగుల కమలాకర్, అనంతరం మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకూ మహాత్మ్యా జ్యోతిభాపూలే, సావిత్రీబాయి పూలేల స్పూర్తి వెల్లివిరుస్తుందని, ఆ గొప్పవ్యక్తుల ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరు కలిసిరావాలన్నారు. పత్రికలు, సెల్ ఫోన్లు లేని సమయంలోనే వెనుకబడిన వర్గాలపై సమగ్ర అధ్యయనంచేసి వారి అభ్యున్నతికి విశేషక్రుషి చేసిన మహనీయుడని, ఎందరో మహనీయులు పుట్టిన పవిత్ర దాత్రి భారతవనిలో బాబూ జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతిభాపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు జన్మించిన ఎప్రిల్ మాసం మరింత పవిత్రమైనదన్నారు. ఆ గోప్ప వ్యక్తుల ఆశయ సాధనలో తెలంగాణ ముఖ్యమంత్రి విశేష క్రుషిచేస్తున్నాడని గుర్తు చేసారు. బాబాసాహెబ్ విగ్రహం మాదిరే మహాత్మా జ్యోతిభాపూలే విగ్రహాన్ని ఏర్పాటుకోసం మంత్రులందరం కలిసి ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈనాడు బీసీలు ఉన్నత చదువులు చదివి అంతో ఇంతో వివిద హోదాల్లో ఉండడానికి కారణం మహాత్మాజ్యతిభాపూలే అన్నారు. పూలే ఆదర్శాలతోనే బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్లు రిజర్వేషన్లను తీసుకొచ్చారన్నారు. గతంలో పట్టుమని పదిమందికూడా విద్యార్థులు లేని హాస్టళ్లలో నీళ్లచారుతో, ఉడకని అన్నంతో ఇబ్బందులు పడ్డామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో బీసీలకు 310 హాస్టళ్ల ద్వారా ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నారన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న తదితర బీసీ బిడ్డల వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహించుకొని వారిని ఘనంగా స్మరించుకుంటున్నామన్నారు.
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే మహాత్మాజ్యోతిభాపూలే ఆశయాలతో బీసీల పట్ల ఆచరణాత్మక విధానంతో పనిచేస్తుందన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావ్ మాట్లాడుతూ చరిత్రలో కొన్ని సంక్లిష్ట సమయాలు కొందరు మహానుభావులను స్రుష్టించాయని, అణగారిన, వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పుకోసం మహాత్మా జ్యోతిభాపూలే విశేష క్రుషి చేసారని స్మరించుకున్నారు.
బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ విద్యార్తిగా నీళ్ల చారుతో అరకొర వసతులతో చదువుకుంటూ గతంలో మహాత్మా జ్యోతిభాపూలే జయంతి వేడుకలకు రవీంద్రభారతిలో వచ్చేవారిమని, నాడు కనీసం ప్రాతినిధ్యం లేని వెనుకబడిన వర్గాలకు నేడు ఇదే వేదిక దొరకడం సీఎం కేసీఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు. బాలిక చదువుకుంటే కుటుంభం బాగుపడుతుందని, సమాజ గతి విద్య ద్వారానే మారుతుందని నమ్మిన పూలే ఆశయాలను అందరూ కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్తో పాటు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండాప్రకాష్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం క్రుష్ణమోహన్ రావ్, సభ్యులు ఉపేంద్ర, కిషోర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, పూలే జయంతి కమిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కన్వీనర్లు, కోకన్వినర్లు, బీసీ సంఘాల నేతలు, అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.