హైదరాబాద్, నవంబర్ 10 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. రాహుల్ గాంధీ కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమే తెలంగాణలో కుల గణన చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు వరంగల్‌లో పర్యటించిన కేటీఆర్.. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ అంటూ బీసీలకు కాంగ్రెస్ హామీ ఇచ్చి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే గతి లేదు కానీ ప్రజల కోసం కొత్తకొత్త పథకాలు తెస్తారా రేవంత్.. అంటూ చురకలంటించారు. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది చాలదా కాంగ్రెస్‌కు అని విమర్శించారు.
‘‘కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. చేతి గుర్తుకు ఓటేస్తే, చేతివృత్తులవారి గొంతు కోసింది. ఇప్పుడు బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో నాటకం ఆడుతోంది. సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ గ్యారెంటీలు ఏవని నిలదీస్తున్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని పొంగులేటి అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘బీసీ గురుకులాలు, బీసీ డిగ్రీ కళాశాలలు ఎటు పోయాయి. చేసిన మోసానికి బీసీలకు క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చిత్తశుద్ధిపై మాకు అనుమానాలు ఉన్నాయి. 60 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టింది ఏమి లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసం కులగణన డ్రామా నడుస్తోంది. కులగణనను స్వాగతిస్తున్నం, రాజకీయ ఆర్థిక నేపథ్యం పై ప్రశ్నలు ఎందుకు. బీసీ డిక్లరేషన్ పై బీసీలను చైతన్యం చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్‌లపై మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మా ఎమ్మెల్యేల పై దాడి చేయడం కాదు. దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు’’ అని KTR ఛాలెంజ్ చేశారు.
‘‘సిగ్గు ఎగ్గు, నీతి, లేకుండా దగుల్బాజీ మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు వెళ్లి చేయని పనులు, చేసినట్లు చెప్పారు. రైతులకు 500 బోనస్ ఇచ్చినట్లు మహారాష్ట్రలో చెప్పారు, అది నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాం. 420 హామీలు, 6 గ్యరెంటీలు అమలు చేసేదాకా వెంటపడతాం. కాంగ్రెస్ అతి వేషాలు వేస్తే, ప్రజలే బట్టలు విప్పి ఉరికించి కొడతారు’’ అని హెచ్చరించారు.