నిరూపిస్తే క్షమాపణలకు సిద్ధం…!
- నిరూపించ లేక పోతే ముక్కులు నేలకు రాస్తారా…!!
- కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్
తిరుమలగిరి, జూన్ 29 (విశ్వం న్యూస్) : అభివృద్ధి జరగలేదని నిరూపించగలిగితే క్షమాపణలు చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో జరిగిన ప్రగతిని నిరూపిస్తే అదే కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి నుండి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాస్తారా అంటూ ఆయన కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. అధికారులు అప్పుడున్న వారే ఇప్పుడూ ఉన్నారని వారిచ్చిన గణాంకాలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చిచెప్పారు. గురువారం సాయంత్రం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పురపాలక సంఘం పరిధిలో స్థానిక శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రగతినివేదన సభలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక మరియు ఐటి,పరిశ్రమల శాఖామంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలువకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 కు పూర్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ సాగు కేవలం 4 లక్షల ఏకరాలలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే 2014 తరువాత 40 లక్షల ఎకరాలలో సాగు జరిగి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిన విషయం ఒక్కటే సరిపోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాకు ఏమి చేశారో అన్నది ఇట్టే తెలిపోతుందన్నారు.ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్ని కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలో మటు మాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. అంతెందుకు కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా, వణుకుతూ ప్రాణాభీతితో ఇంట్లో కూర్చున్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేశారు,మంత్రి జగదీష్ రెడ్డి ఏమి చేశారు అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అందుకే కాబోలు ఈ కాంగ్రెస్ నేతలను ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బండకేసి కొడితే నాలుగు ఏళ్లుగా మూలకు కూర్చొని మూలుగుతూ ముక్కుతూ పాదయాత్రల పేరుతో రోడ్డెక్కిన ఈ వృద్ధ సింహాలు ప్రజలకు మాయ మాటలు చెప్పేందుకు తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కాకతీయుల పాలనకు పూర్వమే తెలంగాణా ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేదని అటువంటి సుభిక్షంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని ఆయన దుయ్యబట్టారు. అటువంటి ప్రాంతాన్ని తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో సాగు నీరు,త్రాగు నీరు ఇచ్చి సస్యశ్యామలంగా మార్చడమే కాకుండా భారతదేశానికి అన్నదాతగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కితాబిచ్చారు. పైగా రాజకీయ కక్షలతో తుంగతుర్తి లాంటి ప్రాంతంలో రక్తపుటేరులు పారించారన్నారు.వారి పాలనకు నిదర్శనంగా ఊరి పొలిమేరల్లో సమాధులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయన్నారు.అటువంటి దుర్భర పరిస్థితులనుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాను బయటపడేసి ప్రగతి పథంలో నడిపిస్తుంటే ఇంత కాలం మూలన కూర్చున్న వృద్ద సింహాలు పాదయాత్రలు అంటూ రోడ్డెక్కి మాయమాటలతో మసి పూసి మారేడుకాయ చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. పైగా హైదరాబాద్ లో కూర్చుని ఐటి మంత్రి కేటీఆర్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ అంటే ఏందో అర్థం కావడానికి మొత్తం చదవాల్సిన పని లేదని హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ చౌరస్తా వద్ద రూపొందించిన సిగ్నల్ ఫ్రీ జంక్షనే వారికి సరయిన సమాదానమన్నారు. ఆ మాట కొస్తే యావత్ భారతదేశానికే కాదు అమెరికా లాంటి దేశాలకు కుడా ఐటి మంత్రి, పరిశ్రమల మంత్రి,పురపాలక శాఖామంత్రి అంటే గుర్తుకు వచ్చేది మంత్రి కేటీఆర్ పేరు మాత్రమే నన్నారు.మంత్రి కేటీఆర్ ను ప్రపంచ దేశాలే కాదు భారతదేశం మొత్తం కూడా దేశ ఐటి మరియు పురపాలక ,పరిశ్రమల శాఖామంత్రి గానే చుస్తుందన్నారు. అసలు భారత ఐటి ,పురపాలక,పరిశ్రమల శాఖామంత్రి ఎవరో ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియదని ఆయన ఎద్దేవాచేశారు.
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచానికి పరిచయంచేస్తే ప్రపంచ దేశాలలో రాష్ట్రాన్ని ఐటి,పరిశ్రమల రంగంలో తెలంగాణాను దిక్సూచిగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్ దని ఆయన ప్రశంశించారు.నిన్న గాక మొన్న మహారాష్ట్రలో పర్యటించినప్పుడు ఈ దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అన్నది స్పష్టం అయిందన్నారు. 2014 కు పూర్వం తెలంగాణా లో ఉండే దుర్భర పరిస్థితులు ఇప్పుడు మహారాష్ట్ర తో పాటు యావత్ భారతదేశంలో ఉన్నాయన్నారు.అందుకే యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చుస్తున్నారన్నారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ప్రగతిపథం లో నడిపించిన అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్రహ్మరధం పట్టి రుణం తీర్చుకునెందుకు ప్రజలు సన్నద్ధమౌతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.