అత్యుత్సాహమా…
అధికార భక్తియా?

నకిరేకల్, జనవరి 3 (విశ్వం న్యూస్) : తన వృత్తి ఏమిటో… తన బాధ్యత ఏంటో ఒక పోలీస్ అధికారి మర్చిపోయాడా? యూనిఫాం గౌరవం ఇంత చులకనైపోయిందా? నకిరేకల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించిన అధికార పార్టీ కార్యక్రమం సందర్భంగా, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వయంగా మాంసాహారం వడ్డిస్తున్న వ్యక్తి ఎవరో కాదు… నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు. అది కూడా సామాన్య దుస్తుల్లో కాదు… పూర్తి పోలీస్ యూనిఫాం ధరించి ఉండటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
సాధారణంగా పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించడం, ప్రజల రక్షణే ప్రధాన కర్తవ్యంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ ఘటనలో మాత్రం ఒక పోలీస్ అధికారి తన విధులను పక్కనపెట్టి క్యాటరింగ్ సిబ్బంది పాత్రలోకి దిగినట్టు కనిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలకు స్వయంగా వంటకాలు వడ్డించడం, “మటన్ ముక్క వేసుకోండి సార్” అంటూ ఆహ్వానించే స్థాయికి దిగజారడం పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రవర్తనా? లేక అధికార పార్టీ పట్ల చూపుతున్న అతివిధేయతనా? లేదా పోలీస్ వ్యవస్థపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడికి మరో స్పష్టమైన ఉదాహరణనా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “ఇదేనా పోలీస్ రాజ్యం?”, “యూనిఫాం అంటే ఇంత చులకనా?” అంటూ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఒక పోలీస్ అధికారి రాజకీయ నేతలకు ఈ విధంగా సేవలు చేయడం పోలీస్ నిబంధనలకు విరుద్ధమా కాదా? ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? లేక అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమమైతే అన్నీ మాఫీనా? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నకిరేకల్‌లో జరిగిన ఈ ఘటన మాత్రం పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అధికార పార్టీకి సేవకులుగా మారుతున్నారా? అనే అనుమానాలకు ఈ సంఘటన తావిస్తోందని విమర్శకులు అంటున్నారు.
ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందిస్తారా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక ఇది కూడా మరో వివాదంలా ఫైళ్లలోనే మగ్గిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.