Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు: మార్చి–ఏప్రిల్‌లో మంజూరు-మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హైదరాబాద్, జనవరి 3 (విశ్వం న్యూస్) : తెలంగాణలో సొంత ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ‘ఇందిరమ్మ ఇండ్లు’ అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే మార్చి–ఏప్రిల్ నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతనే ప్రాతిపదికగా ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇళ్ల పంపిణీ కమిషన్లు, పార్టీ ప్రాతిపదికన జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రిలోనూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయని, వాటిని తమ ప్రభుత్వమే పూర్తి చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 36 వేల ఇళ్ల కోసం రూ. 744 కోట్లు కేటాయించామని తెలిపారు.

అలాగే వివిధ దశల్లో ఆగిపోయిన 12 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అనుసంధానిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేదల కోసం ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్లు నిర్మిస్తామని, అటవీ ప్రాంతాల్లో ఫారెస్ట్ క్లియరెన్స్, ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సింగరేణి పరివాహక ప్రాంతాల్లో 76 జీవో ప్రకారం పట్టాల పంపిణీపై వచ్చే కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే 12,500 ఇళ్లను మంజూరు చేశామని, చెంచు జాతి వారందరికీ తొలి విడతలోనే ఇళ్లు కేటాయించామని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *