
- కొండగట్టు అంజన్న ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ సేవాభావం – ఆలయ అభివృద్ధి కోసం ₹35.19 కోట్ల TTD నిధులతో దీక్షా విరమణ మండపం & సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అత్యంత సంతోషదాయకం:ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
కొండగట్టు, జనవరి 3 (విశ్వం న్యూస్) : పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నకు భక్తితో కూడిన కృతజ్ఞతగా ఈ కార్యాచరణ నిలుస్తోంది. ఆనాడు జరిగింది కేవలం అదృష్టం కాదు… సాక్షాత్తు కొండగట్టు అంజన్న చూపిన దైవానుగ్రహమే. 2009లో హుస్నాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన తీవ్రమైన విద్యుత్ ప్రమాదం నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలతో బయటపడటాన్ని ఆయన స్వయంగా కొండగట్టు అంజన్న ఆశీస్సుల ఫలితంగా భావించడం, ఆయనలోని అచంచలమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనం.
తనకు పునర్జన్మనిచ్చిన ఆ పవిత్ర క్షేత్రంపై కృతజ్ఞత భావంతో, కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ₹35.19 కోట్ల టిటిడి (TTD) నిధులతో దీక్షా విరమణ మండపం మరియు సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అత్యంత హర్షణీయమైన విషయం. ఇది కేవలం ఒక ఆలయ అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు… ఆధ్యాత్మికతతో ముడిపడ్డ సామాజిక బాధ్యతకు ప్రతీక. ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, ప్రజాసేవ భావనను సమన్వయం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి సేవాభావానికి మరో స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రజల పక్షాన ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
అలాగే, ఈ నిధుల మంజూరుకు చొరవ చూపి సహకరించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భక్తి, విశ్వాసం, సేవ—ఈ మూడు విలువల సమ్మేళనంగా కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.