కవిత దీక్ష విరమణ
- కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కే.నారాయణలతో కలిసి కవితకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేసిన రవిచంద్ర
హైదరాబాద్, మార్చి 10 (విశ్వం న్యూస్) : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ కే.నారాయణ,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్స్ కల్పించాలనే బిల్లు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.ఈ బిల్లు దుమ్ము దులిపి ఈనెల 13వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ కవిత నిరాహారదీక్ష చేబూనారు. ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభించిన దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. ఎంపీ రవిచంద్ర సీపీఐ ప్రముఖులు కే.నారాయణ, ఎంపీలు కే.కేశవరావు,నామా నాగేశ్వరరావులతో కలిసి కవితకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఆమెకు సంఘీభావంగా మంత్రులు సత్యవతి రాథోడ్,సబితా ఇంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలచారి, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్ పర్సన్ ఆకుల లలితలతో పాటు వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షలో కూర్చున్నారు.