హైదరాబాద్, డిసెంబర్ 15 (విశ్వం న్యూస్) : పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే థియేటర్‌కు సినిమా చూసేందుకు దిల్‌సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన భాస్కర్, అతడి భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్, కూతురు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా బాలుడి హెల్త్ బులిటెన్ బయటకు వచ్చింది. శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. కోమాలోనే ఉన్నట్లు సమాచారం. ట్రీట్‌మెంట్‌కు స్పందించటం లేదని.. పైప్ ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారం అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతానికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని.. ఇక ఆ దేవుడే భారమని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. గత 11 రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. చిన్నారి కోలుకోవాలని పలువురు ప్రార్థిస్తున్నారు.