విద్యార్థుల్లో పరిశీలనాత్మక శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం
> జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
>జయాపజయాలను వదిలేసి వైజ్ఞానిక ప్రదర్శనలలో చురుగ్గా పాల్గొనాలి
>సెయింట్ క్లేర్ సైన్స్ ఎక్స్ పో-2023 ని ప్రారంభించి, ప్రదర్శనలను తిలకించిన జిల్లా కలెక్టర్
రామగుండం, జనవరి 10 (విశ్వం న్యూస్) : విద్యార్థుల్లో శాస్త్రీయ అభిరుచి, పరిశీలనాత్మకత శక్తిని పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు. మంగళవారం రామగుండం ఎన్.టి.పి.సి.టౌన్ షిప్ లోని సెయింట్ క్లేర్ ఉన్నత పాఠశాలలో “సైన్స్ ఎక్స్ పో-2023” పేరిట ఏర్పాటు చేసిన ఒక్క రోజు వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు జయాపజయాల పై దృష్టి సారించకుండా ప్రతి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని విజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలో ఒకరి ఆలోచనలు మరోకరు తెలుసుకొని విజ్ఞానం పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
నూతన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, శాస్త్రీయ విషయాలలో ఇమిడి ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను ఉపాధ్యాయులను ప్రశ్నించి పూర్తి అవగాహన పొందాలన్నారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యం-పరిశుభ్రత, రవాణా, గణిత నమూనాలు, పర్యావరణ హితమైన పదార్థాలు లాంటి ఏడు ఉప అంశాలతో ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు మొత్తం 162 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రదర్శనను ఏర్పాటు చేసిన అన్నీ గదులను పరిశీలించి ఎగ్జిబిట్లు రూపొందించిన విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి వారి నుండి వివరాలు రాబట్టారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, ఎన్.టి.పి.సి అధికారులు సామ్యూల్ ప్రశాంత్,కె.వి.ఎం.కె శ్రీనివాస్,జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు, పాఠశాల ప్రదానోపాధ్యాయులు ఎ.డోమినిక్, రాయపురెడ్డి, నోయల్ జోసెఫ్, బి.మల్లేశం, ఉపాధ్యాయులు శ్రీనివాస్,రతన్ కుమార్, పెద్దఎత్తున విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.