కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

పెద్దపల్లి, జనవరి 21 (విశ్వం న్యూస్) : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో సమావేశం హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనవరి 19, 20వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షన్ కళ్ళద్దాలను ఆర్డర్ చేశామని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని, శని ఆదివారాలు క్యాంపులు ఉండవని సీఎస్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు.

కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ…
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో 2 రోజుల్లో 9,800 మందికి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించి 1817 మందికి రీడింగ్ కళ్ళద్దాలు అందించామని అన్నారు. జిల్లాలో ఉన్న 2 బఫర్ బృందాలను వినియోగిస్తూ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీస్, కోర్టు సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంపులు నియోజకవర్గం వారిగా నిర్వహించుటకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నుంచి ఉద్యోగుల కోసం 3 రోజుల పాటు క్యాంపు ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ ఏ శాఖ సిబ్బంది క్యాంపు రావాలో షెడ్యూల్ తయారు చేసి సంబంధిత జిల్లా అధికారులకు అందించాలని కలెక్టర్ ఏఓ ను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ , జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.