కంటి పరీక్షలను చేయించుకొని కళ్ళను సురక్షితంగా ఉంచుకోవాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

కంటి పరీక్షలను చేయించుకొని కళ్ళను సురక్షితంగా ఉంచుకోవాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

34 వైద్య బృందాలతో 100 పని దినాలలో కంటి వెలుగు
దేశంలో ఇతర రాష్ట్రాలకు కంటి వెలుగు ఆదర్శంగా నిలుస్తుంది

పెద్దపల్లి, జనవరి 19 (విశ్వం న్యూస్) : జిల్లాలోని ప్రజలంతా కంటి పరీక్షలు చేయించుకుని , అవసరమైన వారు కళ్ళద్దాలు తీసుకొని కళ్ళను సురక్షితంగా ఉంచుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం స్థానిక ఐ.టి.ఐ. కళాశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కంటి వెలుగు అనగానే కంటి చూపు పరీక్ష అనే తేలిక భావం ఉంటుందని, కానీ ప్రతి మనిషికి కంటి చూపు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించాలని, నివారించదగ్గ అంధత్వాన్ని మనం పరీక్షలు చేసుకొని వెంటనే నివారించు కోవాలని, గతంలో కంటి పరీక్షలను లయన్స్ క్లబ్, ఎల్.ఐ సి., ఇతర ఎన్.జి. ఓ. సంస్థలు అప్పుడప్పుడు, అక్కడక్కడ చేపట్టేవారని తెలిపారు.

కంటి చూపు పై దేశంలో ఒక అధ్యయనం జరిగిన సందర్భంలో 50 శాతం నివారించ దగ్గ అంధత్వం భారత దేశంలో ఉన్నదని కనుగొన్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది సామాజిక బాధ్యతగా భావించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదవారు, కూలీలు, విద్యార్థిని, విద్యార్థులకు తెలవకుండానే సైట్ ఉంటుందని, వారు పరీక్ష చేసుకునే లోగా అది కాస్తా పెరిగి ఇబ్బందులు ఏర్పడతాయని, చదువుకునే పిల్లలకు ఇది ముఖ్యమైనది అని, ఇలాంటి క్యాంప్ లు ద్వారా ఉచితంగా పరీక్ష చేసుకొని నియంత్రణలో ఉంచుకోవచ్చు అని, మందులతో పాటు అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు అందించాలానే ఉద్దేశ్యంతో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో 34 వైద్య బృందాల ద్వారా జనవరి 19 నుండి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి 18 సంవత్సారాల వయస్సు, పైబడిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటుగా, అవసరమైన వారికి కంటి అద్దాలను అందించే బృహత్తర పథకమని, ప్రజలు తమ, తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కంటి వెలుగు శిబిరాల తేదీలను గుర్తు పెట్టుకొని ఆయా తేదీల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారని, కంటి చూపు చాలా సున్నితమైందని, వాటిలో ఉన్న సమస్యలను ముందుగానే గుర్తించాలని, ప్రజలంతా తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, జెడ్పీటీసీ రాంమూర్తి, ఎంపిపి స్రవంతి, కౌన్సిలర్ హనుమంతు, భిక్షపతి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రత్యేక అధికారి డి.ఎఫ్. ఓ.శివయ్య,మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు డాక్టర్ టి.కీర్తన, అప్టోమెట్రిస్ట్ ముప్పు అఖిల, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *