కక్షసాధింపు రాజకీయాలే లక్ష్యం: డాక్టర్ శ్రవణ్ దాసోజు

హైదరాబాద్, జనవరి 26, 2026 (విశ్వం న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి SIT నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్రంగా ఖండించారు.

డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ముందస్తు ప్రణాళికాబద్ధమైన రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ నాయకత్వాన్ని మానసికంగా వేధించడం, పార్టీ ప్రతిష్టను దిగజార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేదన్నారు. ఇది నిష్పక్షపాత దర్యాప్తు కాదని, పూర్తిస్థాయి ‘విచ్ హంట్’ మాత్రమేనని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి విచారణల డ్రామాలకు తెరలేపుతోందని దాసోజు విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీపై ఇలాంటి కుట్రలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు. శ్రీ కేటీఆర్, శ్రీ హరీష్ రావు నుంచి నేడు సంతోష్ కుమార్ గారి వరకు అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం ఇలాంటి బెదిరింపులకు ఎప్పటికీ లొంగదని తేల్చిచెప్పారు.

పోలీసు యంత్రాంగాన్ని, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టడమని దాసోజు అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఈ ప్రభుత్వ చర్యలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు.

ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని గంటలు విచారించినా ప్రజల పక్షాన నిలబడే బీఆర్ఎస్ సంకల్పాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అక్రమ కేసులను కోర్టుల్లోనూ, ప్రజల మధ్యనూ ఎండగడతామని, రాజకీయ కక్షలకంటే ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలు త్వరలోనే తిప్పికొడతారని డాక్టర్ శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *