
హైదరాబాద్, అక్టోబర్ 22 (విశ్వం న్యూస్) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ బిజెర్నగర్ హరిజన భవన్లో దళిత సంఘ నాయకులు శ్రీ సదానందం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు నందికంటి శ్రీధర్, షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ — “ఉద్యమకాలం నుంచే దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో దళితుల కోసం రూ.50,000 కోట్ల నిధులు కేటాయించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్దే. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలను ఆర్థికంగా బలపరిచిన సాహసోపేత నాయకుడు శ్రీ కె.సి.ఆర్ గారే,” అని తెలిపారు.
“జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సాధారణ ఎన్నిక కాదు; రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. రూ.4,000 పెన్షన్ లేదు, దళిత బంధు నిలిచిపోయింది, కెసిఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, తులాభారం పథకాలు నిలిపివేశారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది,” అని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్దేశించి ఆయన — “బీఆర్ఎస్ గుర్తు ‘కార్’కు ఓటు వేసి, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారిని ఘన విజయంతో గెలిపించి, తెలంగాణ అభివృద్ధి యాత్రను కొనసాగిద్దాం,” అని పిలుపునిచ్చారు.