జూబ్లీహిల్స్‌లో ప్రజల తీర్పు బీఆర్‌ఎస్‌కే:కేసీఆర్

Advt

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (విశ్వం న్యూస్‌) : జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఇప్పటికే ప్రజలు ఖాయం చేశారని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో తన నివాస ప్రాంగణంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఉపఎన్నికలో ప్రజల మద్దతు బీఆర్‌ఎస్ వైపే ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలనపై అవగాహన కల్పించి భారీ మెజారిటీ సాధించాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని కేసీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ప్రజల విజ్ఞతకు అవమానమని అన్నారు. శాంతి భద్రతల రక్షణ కోసం విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో నశించాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కిట్, గొర్రెల పంపిణీ, మిషన్ భగీరథ వంటి పథకాలను ఎందుకు నిలిపేశారో ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలని ఆయన సూచించారు.

“రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండడం అంటే ప్రతి రంగం చైతన్యంగా ఉండాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ఏ రంగమూ బాగోలేదు. రెండు సంవత్సరాల్లోనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూలదోయారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రియల్‌ ఎస్టేట్‌ నుంచి విద్యా రంగం వరకు ప్రతీ విభాగంలో అభివృద్ధి సాధించామన్నారు. ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి ప్రజల జీవితాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

“జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ గెలుపుతో రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తారు. ప్రతి నేత పట్టుదలతో పనిచేసి భారీ మెజారిటీ లక్ష్యంగా కృషి చేయాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

మూడు గంటల పాటు సాగిన ఈ సన్నాహక సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. సమావేశం చివర్లో ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసంతో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *