యుసిసి బిల్లును వ్యతిరేకించాలి:సిఎం కేసీఆర్

యుసిసి బిల్లును వ్యతిరేకించాలి

  • దేశ ప్రజల నడుమ
    చిచ్చు పెడుతున్న బిజెపి

హైదరాబాద్, జూలై 10 (విశ్వం న్యూస్) : దేశాభివృద్ధిని విస్మరించి ఇప్పటికే పలు రకాలుగా దేశ ప్రజల నడుమ చిచ్చు పెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి పౌర స్మృతి ( యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్నప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీసుకునేనిర్ణయాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని, అందులో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును వ్యతిరేకిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. యుసిసి బిల్లుతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, పలు మతాలు. జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూ మతాన్ని ఆచరించే ప్రజలూ అయోమయానికి లోనవుతున్నారని సిఎం అన్నారు.

దేశ ప్రజల అస్థిత్వానికి వారి తర తరాల సాంప్రదాయ సాంస్కృతిక ఆచార వ్యవహారాలకు గొడ్డలిపెట్టుగా మారిన.. బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యుసిసి బిల్లును వ్యతిరేకించాలని, తద్వారా దేశ ఐక్యతకు పాటు పడాలని కోరుతూ… సోమవారం నాడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు ఖాలీద్ సయీఫుల్లా రెహ్మాని ఆద్వర్యంలో బోర్డు కార్యవర్గం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఏ.ఐ.ఎం.ఐ.ఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ వొవైసీ, ఎమ్మెల్యే అక్భరుద్దీన్, మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్, బోర్డు కార్యవర్గ సభ్యలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ…’కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న యుసిసి నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టమౌతున్నది. దేశంలో ఎన్నో పరిష్కరించాల్సిన సమస్యలున్నా పట్టించుకోకుండా గత తొమ్మిదేండ్లుగా దేశ ప్రజల అభివృద్ధి ని ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది బిజెపి ప్రభుత్వం. దేశంలో పనులేమీ లేనట్టు.. ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకే యుసిసి అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే బిజెపి తీసుకోవాలనుకుంటున్న యుసిసి బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వ్యతిరేకిస్తుందని సిఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ యు.సి.సి బిల్లు పై పోరాడుతామని సిఎం స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్దం చేసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావులకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

కాగా…. మతాలకు ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడాలని, దేశంలోని గంగ జమునీ తహజీబ్ ను రక్షించేందుకు ముందుకు రావాలని, తమ అభ్యర్థనను అర్థం చేసుకుని, తక్షణమే స్పందిస్తూ…ఉమ్మడి పౌర స్మృతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినందుకు దేశ ప్రజలందరి తరఫున, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ గారికి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *