పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు.
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో ఈ బాబ్ మేళాను నిర్వహించారు. 120 కంపెనీల చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్య్వూలను నిర్వహించారు. 4వేలకు పైగా మంది యువతీయువకులు హాజరయ్యారు. ప్రణాళిక సంఘ ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పోలీస్ శాఖ జాబ్ మేళాను నిర్వహించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. అందివచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం కొనసాగించాలని చెప్పారు. మారుతున్న కాలానికనుగుణంగా పోటీపడాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలకోసం నిరుద్యోగ యువత వారధి యాపు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ యువత దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు.
10 మంది టాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశం.
ఈ జాబ్ మేళాలో 10మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అమెజాన్ కంపెనీలో నెలకు 30వేల రూపాయల వేతనంతో వారు ఉద్యోగ అవకాశాలను పొందారు.ఎక్కడ లేని విధంగా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఒక దశలోఅట్టి ఉద్యోగ పత్రాన్ని ఒక ట్రాన్స్ జెండర్ తీసుకుంటూ సంతోషంలో ఉద్వేగానికి గురయ్యారు.ఈ విధంగా పోలీసులు తమకు ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వడం తమ జీవితంలో మర్చిపోలేని సంఘటనని పోలీసుల సేవా తత్పరాన్ని కొనియాడారు.
ఉద్యోగాలు పొందిన ట్రాన్స్ జెండర్లకు ప్రణాళికసంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ నియామకపత్రాలను అందజేశారు. సుమారు 120 పెద్ద కంపెనీలు ఈ జాబు మేళాలో పాల్గొని ఉద్యోగస్తులను రిక్రూట్ చేసుకున్నాయి. నెలకు కనీసం 20 వేలు మొదలుకొని 50 వేల వరకు జీతంతో సుమారు వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అక్కడికక్కడే అందజేశారు. మిగత కొంత మందికి పరిశీలన అనంతరం నియామక పత్రాలు అందజేస్తారని అట్టి కంపెనీల యాజమాన్యం తెలియజేశారు.
ఆకస్మిక గుండెపోట్ల నుండి ప్రజలను
రక్షించేందుకు సిపిఆర్ విధానం పై శిక్షణ
జాబ్ మేళా సందర్భంగా స్థానిక రెనే ఆసుపత్రి నిర్వాహకులు సిపిఆర్ (హృదయ శ్వాసకోశ పునర్జీవనచర్య) విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రోపేసర్ డా. బంగారిస్వామి ఆధ్వర్యంలో వైద్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన సందర్భాల్లో సిపిఆర్ విధానం ద్వారా గుండెకు రక్తప్రసరణం అందించడం, నోటిద్వారా ఆక్సిజన్ అందించడం వల్ల గుండె పనిచేయడం ప్రారంభించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు. ఎస్. శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి. చంద్రమోహన్ (పరిపాలన), ఏసిపిలు తుల శ్రీనివాసరావు, సి.ప్రతాప్ తోపాటుగా పలువురు పోలీసు అధికారులు, వైద్యులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.