పేరబోయిన గూడెం ఇసుక రీచ్ వద్ద ఉధృత ధర్నా

- తహసిల్దార్‌పై తీవ్ర ఆరోపణలు – కలెక్టర్ తక్షణ జోక్యం కోరిన గ్రామస్తులు
నాగారం, జనవరి 22 (విశ్వం న్యూస్) : నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం ఇసుక రీచ్ వద్ద బుధవారం గ్రామస్తులు భారీగా ధర్నా నిర్వహించారు. జాజిరెడ్డి గూడెం నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్లు తమ గ్రామ బాటపై అక్రమంగా రాకూడదని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో బాట పంచాయతీ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రత్యేక నిధుల నుంచి రూ.2 లక్షలు మంజూరు చేసినప్పటికీ, తహసిల్దార్ శ్రీకాంత్ కావాలనే జాజిరెడ్డి గూడెం బాటకు మట్టి పోయకుండా, పేరబోయిన గూడెం బాటకు నామమాత్రంగా మట్టి పోసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా, వర్ధమానుకోట రెవెన్యూ పరిధి నుంచి ఇసుక ట్రాక్టర్లను నడిపిస్తానంటూ తహసిల్దార్ గ్రామస్తులను బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాడని మండిపడ్డారు.
రోజుకు దాదాపు 500కు పైగా ఇసుక ట్రాక్టర్లు ఒకే రోడ్డుపై తిరగడం వల్ల గ్రామంలోకి స్కూల్ బస్సులు, ఉపాధ్యాయులు రాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీని వల్ల పిల్లల విద్యకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, గ్రామస్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జాజిరెడ్డి గూడెం తహసిల్దార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక రీచ్‌ల బాట పంచాయతీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో పేరబోయిన గూడెం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.