ఓయూ ప్రొఫెసర్ సస్పెన్షన్‌పై రాజ్‌భవన్‌ను ఆశ్రయించిన ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు

విశ్వవిద్యాలయాలు మేధో కేంద్రాలే..
బానిసల ఫ్యాక్టరీలు కావు

హైదరాబాద్, జనవరి 22,2026 (విశ్వం న్యూస్) : ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బి. మనోహర్‌ను ఎటువంటి విచారణ లేకుండా సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాలు మేధో వికాసానికి కేంద్రాలే తప్ప, ప్రశ్నించే గొంతులను అణిచివేసే ఫ్యాక్టరీలు కావని ఆయన స్పష్టం చేశారు.

ఓయూలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గవర్నర్‌కు నివేదించినట్టు డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని, ఇది నియంతృత్వ పోకడలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

వర్సిటీలో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, పోలీసుల పాత్రను యూనివర్సిటీ అధికారులే పోషించడం దురదృష్టకరమని డాక్టర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చారిత్రక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.

ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, “విశ్వవిద్యాలయాల్లో ప్రశ్న మరణిస్తే… ప్రజాస్వామ్యమే తన ఆత్మను కోల్పోతుంది” అని డాక్టర్ శ్రవణ్ దాసోజు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *