చర్చకు వచ్చాం…
చీఫ్ మినిస్టర్ ఎక్కడో ?

హైదరాబాద్, జూలై 8 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా అమలు చేస్తున్న అరాచక పాలన వల్ల రాష్ట్రవ్యాప్తంగా గతించిన 600 మంది రైతులకు బీఆర్ఎస్ శ్రద్ధాంజలి ఘటించింది. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు మౌనం పాటించారు.
“రైతన్నలు సాగుకు నిధులు లేక, ఎరువుల బాకీలతో, సాగు నష్టం పుణ్యమా అని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు సకాలంలో రాక, రుణమాఫీ లేనిది… ఇవే ఈ దారుణ పరిస్థితికి కారణం” అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్‌క్లబ్‌లో మౌనప్రదర్శన నిర్వహించి… మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. ‘‘ఇది కేవలం నెంబర్ల విషయంలో కాదు… ఇది నిండా నష్టపోయిన కుటుంబాల విషయం. రైతన్న మట్టిలో కలిసిపోయే పరిస్థితి రాకూడదనేది మా పోరాటం’’ అని వారు పేర్కొన్నారు.
రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. “చర్చకు మేము సిద్ధం. అన్నింటికీ ఆధారాలతో సహా వస్తున్నాం. ఇప్పుడు బంతి రేవంత్ కోర్టులో ఉంది” అని సవాల్ విసిరారు. “కొడంగల్‌లో ఇప్పటికీ రైతుబంధు లభించని 670 మంది రైతుల జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరుతున్నాము. రైతుల శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ నాయకత్వం పూర్తి సమాచారంతో చర్చించేందుకు సిద్ధంగా ఉంది” అని కేటీఆర్ ప్రకటించారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు హాజరవుతారని భావించిన తమ పార్టీకి నిరాశ ఎదురైందన్నారు. “రేవంత్ వస్తాడు అనుకుంటే నిన్ననే ఢిల్లీకి పారిపోయాడు. మరి ఇప్పుడు చర్చకు ఆయన బదులుగా వ్యవసాయ మంత్రివస్తాడా? ఉపముఖ్యమంత్రివస్తారా? లేక మరో మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తున్నాం” అని ఎద్దేవా చేశారు. అంతకుముందు రేవంత్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ… గతంలో ఆయన చేసిన రాజకీయ హామీలను గుర్తు చేశారు. “2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు. 2018లో కొడంగల్ ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి వెంటనే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేశావు” అని ఎద్దేవా చేశారు.
“రైతులపై చర్చకు గతంలో చాలాసార్లు పిలిచినా పారిపోయింది రేవంతే. నీళ్లను ఆంధ్రకు పంపించి, నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నావు. నియామకాలన్నీ నీ దగ్గర తొత్తులకే దక్కుతున్నాయి. కొడంగల్‌లో రైతుబంధు అందని వేలాది మందిని మేం రేపే వెలికి తీస్తాం. వారి సమస్యలు ప్రజల ముందుంచుతాం” అని అన్నారు. చివరగా – “చర్చ ఎక్కడైనా జరగచ్చు. కొడంగల్‌లోనైనా, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనైనా, లేక అసెంబ్లీలోనైనా మేము సిద్ధం. పాలన చేయలేకపోతే కేసీఆర్‌కు పదవి అప్పజెప్పు. మేము రైతులను ఎలా ఆదుకోవాలో చేసి చూపిస్తాం” అంటూ కేటీఆర్ గట్టి హామీ ఇచ్చారు.