- కరీంనగర్ పార్లమెంట్‌పై
మూడు పార్టీల నజర్…
హైదరాబాద్, జనవరి 2 (విశ్వం న్యూస్) : కరీంనగర్.. పోరాటం తెలిసిన గడ్డ.. ఉద్యమాలు పురుడు పోసుకున్న గడ్డ. ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ పుట్టింది ఇక్కడే ! తెలంగాణ బీజేపీకి ఆశలు మొదలైంది ఇక్కడే ! కాంగ్రెస్ కంచుకోట కూడా ఇక్కడే ! అందుకే మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్ ప్రతిష్టాత్మకం. బీఆర్‌ఎస్ ఇలాఖాలో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ పావులు కదుపుతుంటే.. ఇక్కడి నుంచే బౌన్స్‌బ్యాక్ కావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటివరకూ పలువురి పేర్లు వినిపించినప్పటికీ… రేవంత్ రెడ్డి అంతగా సంతృప్తి చెందట్లేదని తెలుస్తోంది. సంచలనాలు, అనూహ్య నిర్ణయాలతో అంచనాలను తలకిందులు చేసే రేవంత్ రెడ్డి… ఈసారి కూడా అదే పంథాను అనుసరించబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెర పైకి అనూహ్యంగా మరో పేరు వచ్చి చేరింది.
గతంలో జమ్మికుంట సీఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ రెడ్డి బయోడేటాను రేవంత్ రెడ్డి తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
సీఐ ప్రశాంత్ స్వగ్రామం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామం. పుట్టి పెరిగిన నేపథ్యంతో పాటు జమ్మికుంటలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేయడంతో… హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం… జమ్మికుంట పరిసర ప్రాంత యువతలో ప్రశాంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉండటం సానుకూలంశాలుగా కనిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం ఆగస్టు 15, 2017న జమ్మికుంటలో నిత్య జాతీయ గీతాలపనకు శ్రీకారం చుట్టింది సీఐ ప్రశాంత్ రెడ్డే. యువతలో దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఆయన దీనికి అంకురార్పణ చేశారు. అప్పటినుంచి జమ్మికుంటలో ప్రతీ నిత్యం జాతీయ గీతాలపన సాగుతూనే ఉంది. సీఐ ప్రశాంత్ రెడ్డి అక్కడినుంచి బదిలీ అయిన ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిత్య జనగణమన ఆలాపనతో రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ జమ్మికుంట ఆదర్శవంతంగా, స్పూర్తివంతంగా నిలిచింది. జమ్మికుంట స్పూర్తితో ఆ తర్వాత రాష్ట్రంలోని పలు గ్రామాల్లోనూ జాతీయ గీతాలపన ప్రారంభమైంది.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఎదుర్కోవడంలో ప్రశాంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ఎంతమేర పనిచేస్తుందని సీఎం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీఐ పింగిళి ప్రశాంత్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. మరి ప్రశాంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.