బీఆర్ఎస్కు ఈసారి
25 సీట్లే:రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ ద్రోహిగా తనను చిత్రీకరించేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని.. అసలైన ద్రోహులు వాళ్లేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
శాసనసభ సమావేశాల్లో తండ్రీకుమారుడు తననే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీలో మాట్లాడిన రేవంత్.. జూబ్లీహిల్స్ సొసైటీ డైరెక్టర్‌గా పని చేసినప్పటి నుంచి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడి వరకు ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. చంద్రబాబుకు తాను సహచరుడిని మాత్రమేనని.. శిష్యుడిని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మహబూబ్‌నగర్‌లో ఎంపీగా గెలిపించింది తానేనని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో టీఆర్ఎస్ జెండా మోసేవాళ్లు కూడా పాలమూరులో ఎవరూ లేరని రేవంత్ అన్నారు.
సమైక్యాంధ్రను సమర్థించిన జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిచి విందు ఇచ్చారని.. తెలంగాణ ద్రోహులతో అంటకాగింది కేసీఆర్ మాత్రమేనని ఆరోపించారు. పొన్నం, వివేక్ వెంకటస్వామి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానాన్ని వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆ సందర్భంగా గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ మృతి కోట్ల మందికి తీరని దుఃఖంగా రేవంత్ పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు గద్దర్ గొప్పతనం తెలియకుండా చిన్న చూపు చూసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే నివాళి అర్పించేందుకు కేసీఆర్ వెళ్లలేదని గుర్తు చేశారు. గద్దర్ లాంటి యుద్ధనౌక చనిపోతే అసెంబ్లీలో సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు.
“లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ కలిసిపోయాయని.. వ్యూహాత్మకంగా నడుచుకో” అంటూ గద్దర్ తనకు సూచించారని పేర్కొన్నారు. గద్దర్ స్ఫూర్తితో తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు.