దసరా కానుకగా 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి

దసరా కానుకగా 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి
- తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
విశ్వం న్యూస్ / హైదరాబాద్, అక్టోబర్ 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దసరా పండుగ కానుకగా 51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలకు అసోసియేషన్ తరఫున వినతిపత్రం పంపినట్లు తెలిపారు.
పీఆర్సీ కమిషన్ ఛైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ను నియమించి చాలాకాలం గడిచినా, ఇప్పటివరకు నివేదికపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కష్టాన్ని గుర్తించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్యోగులు విశేషంగా కృషి చేస్తున్నారని గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, వైద్య బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ తదితర బకాయిల చెల్లింపులకు బడ్జెట్ కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రెండు డీఏలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, మిగిలిన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు.
అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద హెల్త్ కార్డు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ ప్రకటనతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు దసరా, దీపావళి పండుగలను సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.