యువతే మార్పుకు పునాది: దాసోజు శ్రవణ్

యువతే మార్పుకు పునాది: దాసోజు శ్రవణ్

విశ్వం న్యూస్/అక్టోబర్ 11 : విద్యావంతుల మౌనం సమాజానికి చేటు చేస్తుందని, యువతే సమాజంలో మార్పునకు పునాది అని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ అన్నారు. హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్ల అనర్హులు పదవుల్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయని, సుమారు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ ఖ్యాతి దెబ్బతింటోందని విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యుత్ కోతలు, తాగునీరు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శించారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుని, బీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని దాసోజు శ్రవణ్ కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బీఆర్ఎస్వీ నాయకుడు మధుకర్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.