కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి

కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య,ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
జనవరి 18 నుంచి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభం

ఈ నెల 12 లోగా జిల్లా ఇంఛార్జి మంత్రి సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం
పెద్దపల్లి, జనవరి 3 (విశ్వం న్యూస్) : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సి.ఎస్. సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, సంభందిత జిల్లా అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని, ఇందులో భాగంగా రెండవ విడత కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నందున షెడ్యూల్ రూపొందించుకొని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల్లో, వార్డులలో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించు అతి పెద్ద కమ్యూనిటీ స్క్రినింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు సాధించాలని మంత్రి తెలిపారు.
కంటి వెలుగు శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబులను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు, జిల్లాలో గల జనాభాకు అనుగుణంగా వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో నిర్వహించే విధంగా శిభిరాలు నిర్వహించాలి అన్నారు.
ప్రతి కంటి వెలుగు బృందంలో 1 మెడికల్ అధికారి, 1 అప్తామాలజిస్టు, 2 ఎఎన్ఎం, 3 ఆశా,1 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, వీరికి కార్, అవసరమైన కంటి పరీక్షల యంత్రాలు సిద్దం చేసామని అన్నారు. వైద్య బృందంలో రోజుకు 1500 రూపాయల చోప్పున భోజనవసతి సౌకర్యం కోసం అందించడం జరుగుతుందని, బృందం సభ్యులు స్థానికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ లు చేయాలని మంత్రి సూచించారు.
కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రతి రోజూ వెయ్యి రూపాయల చోప్పున పంచాయతీలకు, మున్సిపాల్టీలకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కలెక్టర్ లకు సూచించారు. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని, మండల పరిషత్, మున్సిపల్ సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ అందజేయాలని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *