కరీంనగర్:మహిమాన్విత
క్షేత్రంగా విరాజిల్లుతున్న
శ్రీ మహాశక్తి దేవాలయం

- ఆలయంలో శక్తి స్వరూపులుగా శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి దేవతామూర్తులు.
- నిష్టతో కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా మారిన అమ్మవార్లు.
- తెలంగాణలోనే శక్తివంతమైన ముగ్గురు అమ్మవార్లతో కొలువుదీరిన అరుదైన ఏకైక దివ్య క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయం.
- దేవాలయంలో ఏ ఉత్సవమైన కన్నుల పండుగే…
- ఈనెల 26న త్రయోదశ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం పై ప్రత్యేక కథనం.
కరీంనగర్ బ్యూరో, మే 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలో శక్తివంతమైన ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ అనంత నాగేంద్ర స్వామి దేవత మూర్తులతో కొలువైన దివ్య క్షేత్రం, మహిమాన్విత క్షేత్రం, శ్రీ మహాశక్తి దేవాలయం. విజయానికి ప్రతిరూపంగా నిలిచే శ్రీ మహాదుర్గ అమ్మవారు, భోగభాగ్యాలు, సకల సిరిసంపదలు అందించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, జ్ఞానానికి, విద్యకు ప్రధాయినిగా నిలిచే శ్రీ మహాసరస్వతి అమ్మవారు ఒకే చోట నిలువైన దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయము. హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో, దేవాలయ నిర్వాహకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 17జూన్ 2010వ సంవత్సరంలో శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి , శ్రీ మహాసరస్వతి, శ్రీ లక్ష్మి గణపతి, అనంత నాగేంద్ర స్వామి సహిత నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్టతో శ్రీ మహాశక్తి దేవాలయానికి అంకురార్పణ జరిగింది.

అరుదుగా ఉండే దేవాలయాలలో శ్రీ మహాశక్తి దేవాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఏక్కడ లేని విధంగా శక్తి స్వరూపులైన ముగ్గురు అమ్మవార్లు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి దేవి ఇక్కడి మహాశక్తి దేవాలయంలో కొలువు తీరడంతో ప్రసిద్ధ దివ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. నిష్టతో కొలిచిన భక్తులకు ఇక్కడి అమ్మ వార్లు కొంగు బంగారంగా నిలిచారు. శ్రీ మహాశక్తి దేవాలయంలో ఏ ఉత్సవం చేసిన అమ్మవారి ఆశీస్సులతో కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత చెప్పుకోవచ్చు, ధనుర్మాసo, శ్రావణమాసం, ఆశ్వీయుజ మాసం, కార్తీక మాసాలలో వచ్చే పండుగలు, వసంత పంచమి, శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, ఉగాది పర్వదిన వేడుకలతో పాటు హిందూ సాంప్రదాయ పండుగలన్నింటి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో శాస్రోత్తకంగా ప్రత్యేక పూజా, హోమ కార్యక్రమాలు నిర్వహించడం దేవాలయంలో ప్రత్యేకత, శివరాత్రి సందర్భంగా శివ పూజ , లింగార్చన, ప్రతి నెల సంకష్టహర చతుర్ధి పూజలు, ఆ రోజు లక్ష్మీ గణపతి హోమం, కార్తీక మాసంలో సామూహిక సత్యనారయణ వ్రతం, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పణ, వరలక్ష్మి వ్రతం, మహిళలు వాయినాలు ఇచ్చుకుంటారు.

వినాయక నవరాత్రులు, దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు, శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, మూల నక్షత్రం సందర్భంగా పల్లకి సేవ, తొమ్మిది రోజులు దాండియాతో పాటు, విజయదశమి రోజున షమీ పూజ, వాహన పూజలు, శ్రీ మహాదుర్గ అమ్మవారు కొలువైన ఇక్కడి ప్రాంతంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా అట్టహాసంగా కన్నుల పండుగగా జరుగుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దీక్ష తీసుకునే భక్తులు వేలాదిగా ఇక్కడి దేవాలయానికి వచ్చి అర్థ మండలం, మండల దీక్ష చేపడుతున్నారు. అలాగే ఇక్కడి శ్రీ మహాసరస్వతి అమ్మవారు చిన్నారుల అక్షరాభ్యాస స్వీకార మహోత్సవానికి కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా మారింది. దేవాలయం అనునిత్యం సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన వేడుకలకు నేలువుగా నిలుస్తుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుంకుమార్చనలతో, నిత్య పూజలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలిచే మహిళలకు భోగభాగ్యాలు, సిరిసంపదలు, సౌభాగ్యాలు, దీర్ఘ సుమంగళిగా దీవెనలు ఇచ్చే అమ్మవారిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రసిద్ధి చెందింది. మొక్కు మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేసి కోరిక తీరాక శక్తి కొలది ప్రదక్షిణలు చేయడం ఇక్కడి ప్రత్యేకత, దీంతో నిత్యం దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

13 ఏళ్ల దేవాలయ ప్రస్థానంలో ఆలయ విశిష్టత నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దివ్య మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించడానికి అనునిత్యం అశేష సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా శ్రీ మహాశక్తి దేవాలయం ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా త్రయోదశ వార్షికోత్సవ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. హంపి పీఠాధిపతులు శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి ఆధ్వర్యంలో నేడు శుక్రవారం రోజున శ్రీ మహాశక్తి దేవాలయ త్రయోదశ వార్షికోత్సవము నిర్వహించనున్నారు. ఉదయం 4:30 గంటలకు శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారికి, శ్రీ మహాదుర్గా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు, అనంత నాగేంద్ర స్వామి వారికి జగద్గురువుల కరకములచే పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్యా వాచనము, గణపతి పూజ, అఖండ దీపారాధనము, సర్వతోభద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర సహిత చండీ హోమం, పూర్ణాహుతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగ అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం చేపట్టనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు సుహాసినిలచే సామూహిక కుంకుమ పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. శ్రీ మహాశక్తి దేవాలయ వార్షికోత్సవ వేడుకల్లో పూజా, హోమ కార్యక్రమాల్లో సమస్త హిందూ బంధువులందరూ పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొంది, కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.