దశాబ్ది ఉత్సవాలకు
రూ.105 కోట్లు విడుదల

హైదరాబాద్, మే 25 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. సచివాలయం ఆరవ అంతస్థులో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.

కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ.. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆరు దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ.. స్వరాష్ట్రంలో అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న సందర్భంలో వేడుకలు వైభవంగా జరగాలని అన్నారు.
రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రులు, ముఖ్య సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎంఒ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారీ కార్యక్రమాల గురించి.. రోజు వారీ చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు.

రూ.105 కోట్ల నిధులు విడుదల
గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు రూ.105 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.