మత పిచ్చి- కుల పిచ్చితో మన దేశం మరో ఆప్ఘనిస్తాన్ అవుతుంది

మానుకోట ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం సమావేశం
మహబూబాబాద్, జనవరి 12 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతంలో తిరిగాను.. ఆనాడు ఇక్కడి కరువు పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. కురవి వీరభద్రుడి దయ, మానుకోట రాళ్ళ బలంతో మన తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైంది. వెనుకబడిన ప్రాంతాల్లో వెలుతురు నింపడం కోసమే పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా విస్తరించాం. అలాగే, మహబూబాబాద్ కు మెడికల్ కాలేజీ ఇచ్చినం. ఇపుడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా అనుమతిస్తున్నం. వచ్చే విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. సీఎం ప్రత్యేక నిధి నుండి మహబూబాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్ల నిధులిస్తున్నం. మరో మూడు మున్సిపాలిటీలు తొర్రూరు, డోర్నకల్, మరిపెడలకు ఒక్కో దానికి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నం, అలాగే, మహబూబాబాద్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రత్యేక నిధి మంజూరు మంజూరు చేస్తున్నం. నూకల రాంచంద్రారెడ్డి గారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు గురువు. అలాంటి మహనీయులను భావితరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే వారి కాంస్య విగ్రహాన్ని మానుకోటతోపాటు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రతిష్టాత్మక సంస్థకు వారి పేరు కూడా పెడతం’’ అని ప్రకటించారు.
తెలంగాణలో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం. మొండిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం కాబట్టే తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య లేదు. ఇపుడు భూ గర్భ జలాలు పెరిగి బోర్ల నుండి నీళ్లు బయటకు కక్కుతున్నాయి. కానీ, కేంద్రం మాత్రం ఏ అభివృద్ధీ చేస్తలేదు. నదీ జలాలు సద్వినియోగం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అనేక రాష్ట్రాలు నీళ్లకోసం తల్లడిల్లుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. మత పిచ్చి- కుల పిచ్చితో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దని కోరుతున్నా. అలాగైతే మన దేశం మరో ఆప్ఘనిస్తాన్ అవుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన చెందారు.