కొత్తగూడెంలో నూతన జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్


భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (విశ్వం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని కుర్చీలో కలెక్టర్ అనుదీప్‌ను కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ కు మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ గారు మహబూబాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా కొత్తగూడెం కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకొని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
