బోడుప్పల్ బంజార భవన్ కు ఒక ఎకరం భూమి కేటాయిస్తాం
బోడుప్పల్ బంజార భవన్ కు
ఒక ఎకరం భూమి కేటాయిస్తాం

- మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బంజారాలకు ఒక ఎకరం భూమి..
- తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉత్సవంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి హామీ
- డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ కార్పొరేటర్ సుమన్ నాయక్ హాజరు
బోడుప్పల్, జూన్ 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని దేవి పద్మ శ్రీ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ గిరిజనోత్సవం కార్యక్రమం జరిగంది. ఈ కార్యక్రమం మేయర్ సామల బుచ్చి రెడ్డి అధ్యక్షతన,కార్పొరేటర్ భూక్య సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తో మొదలై బంజారా సోదరీ మణుల నృత్యాలతో సభా ప్రాంగణం పండుగ వాతావరణంలా కనిపించింది. ప్రభుత్వం గిరిజనులకు ఇంత ప్రాధాన్యత ఇవ్వటం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ భూక్యా సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 3146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండగా టీఎస్ ప్రైడ్ ద్వారా ప్రోత్సహిస్తుంది. పేద మధ్యతరగతి ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర రాజధానిలో సేవాలాల్ బంజారా భవన్ కొమరం భీం ఆదివాసి భవన్ లను నిర్మించారు. అధికారికంగా సేవాలాల్ మహారాజ్ ఆదివాసి పండుగలను నిర్వహిస్తున్నారు.ఎస్టీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేశారు. విద్య ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారు. విద్యాధికులుగా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారులుగా రాజకీయాల్లో రాణిస్తూ అభివృద్ధి బాటలో గిరిజనులు పయనిస్తున్నారని, గిరిజన సమగ్ర అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా మేడ్చల్ నియోజకవర్గంలో గిరిజనులకు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజనులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి గిరిజన భవన్ కొరకు స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని కోరారు.

మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బంజారాలకు కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలన్న వినతిని మంత్రి మల్లారెడ్డి సహకారంతో 1ఎకరం స్థలం కేటాయించేలా చూస్తామని మేయర్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి అతిధులుగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు చందర్ గౌడ్, పద్మా రెడ్డి, సీసా వెంకటేష్ గౌడ్, శ్రీవిద్య చక్రపాణి గౌడ్, మహేశ్వరి కృపాసాగర్ ముదిరాజ్, కోఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న గౌడ్, మేనేజర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
