పేద బస్తీలకు నల్లా కనెక్షన్లు ఇవ్వరా? ఇదేం ప్రజాపాలన?

- ఓసీ, ఎన్వోసీ పేరుతో పేదలకు తాగునీరు దూరం చేయొద్దు: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
విశ్వం న్యూస్, హైదరాబాద్, 23 నవంబర్ 2026 : పేద బస్తీలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడానికి ఓసీ, రెవెన్యూ ఎన్వోసీ నిబంధనలు విధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొందని, ఇది ప్రజాపాలన కాదని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి నివాసానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని అంబేద్కర్ బస్తీ ప్రజలు గత తొమ్మిది నెలలుగా నల్లా కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొంది. రెవెన్యూ ఎన్వోసీ లేనిదే కనెక్షన్లు ఇవ్వలేమని జలమండలి అధికారులు చెబుతుండటంతో, బస్తీ ప్రజలు కొండ ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని మోసుకురావాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
జలమండలి మార్గదర్శకాల ప్రకారం బస్తీలకు స్లమ్ ఏరియా సర్టిఫికెట్ ఉంటే నల్లా కనెక్షన్ పొందే అవకాశం ఉందని, 100 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం, ఏడు మీటర్లలోపు ఎత్తు ఉన్న ఇళ్లకు ఓసీ మినహాయింపు కూడా ఉందని బీఆర్ఎస్ గుర్తుచేసింది. అలాంటప్పుడు పేదల ఇళ్లకు ఓసీ నిబంధన ఎందుకని ప్రశ్నించింది.
హైదరాబాద్ జంట నగరాల్లో సుమారు 1,468 బస్తీలు, 17.6 లక్షల మంది బస్తీవాసులు ఉన్నారని, వీరందరికీ పట్టాలు, ఓసీలు ఎలా సాధ్యమవుతాయని నిలదీసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు కేవలం రూ.1కే నల్లా కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టి, 7.9 లక్షల కొత్త కనెక్షన్ల లక్ష్యాన్ని నిర్దేశించిందని గుర్తుచేసింది. ప్రస్తుతం 20 కిలోలీటర్ల ఉచిత నీటి పథకం ద్వారా 6.5 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతున్నారని, కొత్త కనెక్షన్లు ఇవ్వకపోతే పేదలకు ఉచిత నీరు ఎలా అందుతుందని ప్రశ్నించింది.
ఫిబ్రవరిలో బస్తీ బాట పేరుతో హడావుడి చేసినప్పటికీ తొమ్మిది నెలలు గడిచినా బస్తీల్లో నల్లా కనెక్షన్ల సమస్య పరిష్కారం కాలేదని విమర్శించింది. ఓసీ నిబంధనల కారణంగా అక్రమ నీటి కనెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని, కనెక్షన్లు నిరాకరించడం వల్ల దళారులు, ట్యాంకర్ మాఫియాకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది.
బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్లు ఇవే:
- బస్తీలకు ఓసీ, రెవెన్యూ ఎన్వోసీ నిబంధనలను తక్షణమే రద్దు చేయాలి.
- ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు ఆధారంగా రూ.1కే నల్లా కనెక్షన్లు ఇవ్వాలి.
- పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటికీ 30 రోజుల్లో కనెక్షన్లు మంజూరు చేయాలి.
- కనెక్షన్లు ఇచ్చేంతవరకు బస్తీలకు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి.
తాగునీరు ప్రభుత్వ భిక్ష కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగమని బీఆర్ఎస్ పేర్కొంది. తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకునే ముందు జంట నగరాల్లోని పేద బస్తీల ప్రజల మంచినీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఉన్నవారికి ఒక న్యాయం, పేదవారికి మరో న్యాయమా? పేదలకు తాగునీరు అందించడం కూడా ప్రభుత్వానికి భారమైందా? అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసింది.
