బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో
మహిళలకు రక్షణ కరువు

- మహిళలకు ధమ్కీ ఇచ్చే స్థాయికి ఎదిగారా..?
- బిఆర్ఎస్ నేతలపై ఫైర్ అయిన పిసిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా రావు
- మహిళా సాధికారత కోసం కృషి చేయాలి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్య ప్రసన్నరెడ్డి
కరీంనగర్ బ్యూరో, జూన్ 24 (విశ్వం న్యూస్) : శనివారం రోజు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా సునీతా రావు మాట్లాడుతూ, జిల్లాలో మహిళా శక్తిని బలోపేతం చేస్తూ, మహిళా సమస్యల పట్ల పోరాడుతున్న మహిళలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువ మహిళా శక్తిని మేల్కొ లిపే దిశగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూలై 2న నిర్వహించనున్న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ లో జిల్లాకు చెందిన 16 నుండి 35 సంవత్సరాల లోపు యువ మహిళలు భాగస్వాములు కావాలని కోరినారు. బిజెపి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని బిజెపి నేత లైంగిక వేధింపుల కారణంగా ఢిల్లీలో మహిళా క్రీడాకారులు నిరసన దీక్ష చేపడుతుండగా, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు రాని మహిళా సంఘాల సభ్యులకు బిఆర్ఎస్ నేతలు ధమ్కీ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన విధంగా మన రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయించే విధంగా తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ, అగ్ర నేత ప్రియాంక గాంధీ సమక్షంలో మహిళా డిక్లరేషన్ లో ప్రకటించడం జరుగుతుందని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోటీ చేసేందుకు మహిళా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 18 సంవత్సరాల నుండి మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
సమావేశం అనంతరం పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సునీతా రావు ని డిసిసి అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
