మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలి

మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ అమలు
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జనవరి 25 (విశ్వం న్యూస్) : ఓదెల మండలంలోని మన ఊరు మనబడి క్రింద ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఓదెల మండలంలోని గుండ్లపల్లి, భీమరపల్లి గ్రామాల్లో మన ఊరు మన బడి పనులను, ఓదెల, కొలనూరు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొలనూరు గ్రామంలో ఉన్న 4862 మంది జనాభా కోసం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 10 వరకు 16 రోజుల పాటు కంటి వెలుగు క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో ప్రతిరోజు ఏ ప్రాంతం వారు క్యాంపుకు హాజరు కావాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని, ప్రజలకు అందించే ఆహ్వాన పత్రికలో సదరు వివరాలు తెలియజేయాలని, ప్రజలు అధికారులు సూచించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓదెల మండలం కేంద్రంలో ఉన్న 8366 మంది జనాభాకు పరీక్షలు నిర్వహించుటకు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 27 రోజుల పాటు కంటి వెలుగు క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు షెడ్యూల్ ప్రకారం శిబిరాలకు హాజరై ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించు కోవాలని కలెక్టర్ కోరారు. కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో అవసరమైన వారికి వెంటనే రీడింగ్ కళ్ళద్దాలు పంపిణీ చేయాలని, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు అవసరమైన వారి వివరాలు యాప్ లో నమోదు చేసిన 15 రోజులో పి.హెచ్.సి కు కంపెనీ నుంచి చేరుతాయని, వాటిని త్వరితగతిన సంబంధిత లబ్దిదారులకు అందించాలని కలెక్టర్ తెలిపారు. కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో డాటా ఎంట్రీ పకడ్బందీగా నమోదు చేయాలని, ప్రతి రోజూ అందుబాటులో ఉన్న రీడింగ్ కళ్ళద్దాలు స్టాక్ పై అంచనా వేసుకోవాలని, అవసరమైన కళ్ళద్దాల సంఖ్యను ముందుగానే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఓదెల మండలంలో మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసిన భీరపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, గుండ్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల సందర్శించి మన ఊరు మన బడి పనులను పరిశీలించారు.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని, అప్పటి వరకు పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఓదెల మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలో గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలని, పాఠశాలలకు మంచి లుక్ వచ్చే విధంగా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సర్పంచ్ లు, ఎంపీడీవో సత్తయ్య, తహసిల్దార్ రమేష్ , మండల పంచాయతీ అధికారి వాజిద్, మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *