ఓదెల మండల అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జనవరి 25 (విశ్వం న్యూస్) : ఓదెల మండలంలో పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జె.సమ్మి రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మన ఊరు మనబడి కార్యక్రమం అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ మంగళవారం ఓదెల మండలంలో పర్యటించారు. మన ఊరు మన బడి అంశంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ఓదెల మండలంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మనబడి పనులకు సంబంధించి ఎంబి రికార్డుల నమోదు, పెండింగ్ చెల్లింపులు, పనులు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పాటు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు కలెక్టర్ క్రమశిక్షణ చర్యల కింద పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఓదెల మండల అసిస్టెంట్ ఇంజనీర్ సమ్మీ రెడ్డి ని సస్పెండ్ చేశారు.