ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట ఓట్లు అడగం… డబుల్ బెడ్రూం ఇండ్లు లేనిచోట మీరు ఓట్లు అడగొద్దు…

బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్, జనవరి 28 (విశ్వం న్యూస్): ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేము ఓట్లు అడగం.. డబుల్ బెడ్రూం ఇండ్లు లేనిచోట మీరు ఓట్లు అడగొద్దు అని బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. “ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేము ఓట్లు అడగం..ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా అని సవాల్ విసురుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప..ఈ ఐదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి? నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను. ఇప్పుడు కొడంగల్ లో పరిస్థితి మారింది. ఏ పంచాయితీ అయినా బీఆర్ఎస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజి తీసుకొస్తా అని హరీష్ రావు అన్నడు. మరి కాలేజీ ఎందుకు తెలీదు.. కేసీఆర్ కు కాళ్లు లేవా? పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వలేదు. మాకెందుకు కృష్ణా నీళ్లు, రైల్వే లైను, జూనియర్ కాలేజీ రాలేదు. టీఆరెస్ కు ఓటు వేయడమే ఇక్కడి ప్రజలు చేసిన తప్పా? కాంగ్రెస్ ను గెలిపించుకుందాం కొడంగల్ ను అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేసుకుందాం. కొడంగల్ కు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం. ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అని కేసీఆర్ ఎన్నో మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ తెలంగాణ చేశాడు.

దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్, కొస్గి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. “మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే. వారి పాలనలో మహిళలకు, మైనారిటీలకు రక్షణ లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచింది. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలి” అని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు. రాహుల్ గాంధీది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. ప్రాణాలకు తెగించి దేశ భవిష్యత్తు కోసం రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణా నదిపై రాహుల్ పాదయాత్రకు పాలమూరు బిడ్డలు స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ పాదయాత్ర ముగియడంతో మన బాధ్యత తీరలేదు. హాత్ సే హాత్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని ప్రతీ ఇంటికి, ప్రతీ గుండెకు చేరవేయాలి. ఫిబ్రవరి 6 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలల పర్యటించడానికి సోనియా గాంధీ, ఖర్గే నాకు అవకాశం ఇచ్చారు. మీ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రకు వెళ్లడానికే ఇక్కడకు వచ్చా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.