తెలంగాణకు గ్లామర్ సీఎం కాదు…
గుండె ఉన్న సీఎం కావాలి!

- అగ్నిప్రమాదం బాధితుల పట్ల నిర్లక్ష్యం చూపిన సీఎం: మానవతా విలువల పరాజయం: MLC దాసోజు శ్రవణ్

హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం వార్తలను చూసి నా హృదయం కలచిపోయింది. అమాయక ప్రజలు బతికుండగానే ఆ మంటల్లో కాలిపోయారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో పోరాడుతున్నారు. బాధిత కుటుంబాలు కన్నీరే తాగుతున్నాయి.
ఇలాంటి సమయంలో… మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే హైదరాబాద్‌లో ఉండి కూడా, బాధితులను పరామర్శించేందుకు ముందుకు రాలేదు. ఒకవైపు ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే, మరోవైపు సీఎం గారు బ్యూటీ కాంటెస్టులు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడమేమిటి? ఇది బాధ్యతా లోపమా? అధికార మత్తా? లేక ప్రజల బాధల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమా?
ఢిల్లీ నుంచి ఖర్గే గారు స్పందించారు. కానీ… అదే నగరంలో కూర్చున్న సీఎం మాత్రం స్పందించలేదు. ఇది ఒక పాలకుడిగా మాత్రమే కాదు. ఒక మనిషిగా కూడా విఫలమయ్యారనే సాక్ష్యంగా పరిగణించలేమా? ఘటన స్థలానికి ఒక అడుగు కూడా వేయని నాయకుడి వద్ద, ప్రజల జీవితాల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉందని నమ్మాలి?
అగ్నిప్రమాదంలో దగ్ధమవుతున్న గృహాలకంటే, కెమెరాల కదలికలే ముఖ్యమా?
విపత్తుల వేళ ప్రజల కన్నీళ్ల కన్నా, ప్రచార కార్యక్రమాల వెలుగే విలువైపోయిందా?
తెలంగాణ ప్రజలకు కావలసింది: ఫొటోషూట్లకు పోజిచేసే గ్లామర్ నాయకుడు కాదు.
గుండెతో స్పందించే, బాధితుల పక్కన నిలిచే నాయకుడు.