
- గ్రానైట్ వ్యాపారిపై బెదిరింపు ఆరోపణలు – శంషాబాద్లో అరెస్ట్
హైదరాబాద్, జూన్ 21 (విశ్వం న్యూస్): తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కలకలం రేపే పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వెంటనే వరంగల్ తరలించారు.
అధికార సమాచారం మేరకు, కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని కౌశిక్ రెడ్డి బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణ. దీనిపై మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసు నమోదైంది.
అనేక వివాదాలతో వార్తల్లో నిలిచిన కౌశిక్ రెడ్డిపై ఈ అరెస్ట్ మరింత చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధుల నుండి స్పందన రావచ్చని అంచనా.