తానైతే మంచోడిని కాను!

  • బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయంటూ కేటీఆర్ ఫైర్

మల్కాజిగిరి, జూలై 18 (విశ్వం న్యూస్): ‘‘ఎవరు ఎక్కడ ఎలా వేధించారో అన్ని పేర్లు రాసిపెట్టండి. వడ్డీతో సహా తిరిగి చెల్లించేది తానేనంటూ… తానైతే మంచోడిని కాదంటూ… అధికార యంత్రాంగానికే గట్టి వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (కేటీఆర్).’’

ఇటీవల మల్కాజిగిరిలో బోనాల చెక్కుల పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకులను పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్, అక్కడే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు ఎవరిచేత అయినా బీఆర్ఎస్ నేతలు వేధింపులకు గురవుతుంటే వాళ్ల పేర్లు రాసుకోండి. అది ఇప్పుడే కాదు… తర్వాత మేం చూస్తాం. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పినా వినను. ఎందుకంటే తానైతే మంచోడిని కాను!’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధైర్యం కోల్పోవద్దు – నాయకులకు ఆదేశాలు
‘‘ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైనా బద్నాం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. కేసులు పెడతారు. బెదిరిస్తారు. కానీ మీరు వెనక్కి తగ్గొద్దు. ప్రజలు మన వెంట ఉన్నారు. మన కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడి ముందుకు వెళ్లాలి,’’ అని ఆయన సూచించారు.

ఘర్షణకు మూలం – స్టేజీపై సీట్ల గొడవ
జూలై 15న మల్కాజిగిరి పరిధిలోని అల్వాల్ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు స్టేజీపై కుర్చీలు లేకుండా, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రస్తుత కార్పొరేటర్లను పక్కన పెట్టి మాజీ కార్పొరేటర్లకు సీట్లు ఇవ్వడమే గొడవకు దారితీసింది. వాగ్వాదం దాడులకూ దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగినట్లు ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటనపై కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *