మున్సిపల్ ఎన్నికలే సెమీఫైనల్స్‌గా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ

  • కేటీఆర్ నేతృత్వంలో జిల్లాల వారీగా సమీక్షలు –కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచారాస్త్రం

హైదరాబాద్, జనవరి 11, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పట్టణాలపై పూర్తి స్థాయి ఫోకస్‌తో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

ఈ కార్యాచరణకు ముందుండి నడిపిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జిల్లాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ కేడర్‌ను చైతన్యపరుస్తున్నారు. కేటీఆర్ పర్యటనలతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. పట్టణ ఓటర్లను మళ్లీ ఆకట్టుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మున్సిపల్ ఎన్నికలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి ఆధిపత్యం చెలాయించాలన్నది పార్టీ లక్ష్యం. అందులో భాగంగా కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలాబలాలు, ప్రచార వ్యూహాలపై లోతైన చర్చ జరుగుతోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కీలక సమావేశాలు పూర్తికాగా, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ సమీక్షలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అభ్యర్థుల ఎంపికలో గెలిచే అవకాశాలే ప్రామాణికంగా తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ భావిస్తోంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తమైందని, గత ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాలను నిర్లక్ష్యం చేశారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. మిషన్ భగీరథ, పట్టణ మౌలిక వసతుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తమకు అనుకూలంగా మారాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించి, పట్టణ ఓటర్ల మద్దతును సంపూర్ణంగా దక్కించుకోవాలన్నది పార్టీ వ్యూహం. కేసీఆర్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తూ బీఆర్ఎస్ హైకమాండ్ అడుగులు వేస్తోంది. పట్టణాల ఫలితాలే రాబోయే రాష్ట్ర రాజకీయ దిశను నిర్ధారిస్తాయన్న విశ్వాసంతో గులాబీ పార్టీ పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *