బీఆర్‌ఎస్ పాలనతోనే ఈ దేశం బాగుపడుతుంది : సీఎం కేసీఆర్
నాందేడ్, ఫిబ్రవరి 5 (విశ్వం న్యూస్) : మన భారత దేశాన్ని 70 ఏండ్లకు పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలించాయి, దేశంలో వెనకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం. ఈ దేశ దుస్థితిని చూసిన తర్వాత ఈ పరిస్థితి మార్చాల్సి ఉందని భావించాం. మా సంకల్పానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుంది. నేను చెప్పే ఇషయాలకు ఇక్కడే మరిచిపోకుండా.. మీమీ గ్రామాల్లో చర్చించండి. దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉంది. బీఆర్ఎస్ పాలనతోనే ఈ దేశం బాగుపడుతుంది’’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినట్టే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు, ప్రధానులు, నాయకులు మారిన దేశం తలరాత మారలేదని అన్నారు. ఇన్నేళ్లయినా తాగునీరు లేదు. సాగు నీరు లేదు.. కరెంట్ లేదు అని అన్నారు. వనరులు లేక కాదు.. చేతకాక ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందన్నారు. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశంలో సాగు, తాగునీరు, కరెంట్ కోసం కష్టాలేనా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత నేతలు మాటలకే పరిమితమవుతున్నారని, దేశంలో నాయకత్వ మార్పు రావాలని పిలుపునిచ్చారు.
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్
మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచించాలని సూచించారు. ఎన్నికష్టాలు.. ఎన్ని కన్నీళ్లు.. ఎంత ఆవేదన ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించండి. దేశానికి అన్నంపెట్టే రైతన్న ఉసురు తీసుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని నినదించింన పార్టీ దేశంలో బీఆర్‌ఎస్ ఒక్కటే అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ఇందుకు కారణం ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎందుకీ దుస్థితి అని ప్రశ్నించారు. దేశంలో 42 శాతం మంది రైతులే ఉన్నారని అన్నారు. కేంద్రంలో పార్టీలు మారాయి.. ప్రధానులు మారారని, అయినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. పంటను మీరే పండించాలి.. మీరే అమ్ముకోవాలి. అప్పుడే రైతు రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడు మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదని కేసీఆర్ అన్నారు. మతాలు, జెండాలు, కులాల పేరుతో దేశంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం అని సీఎం కేసీఆర్ తెలిపారు. మన దేశంలో 16 కోట్ల మంది రైతులు ఉన్నారని.. దేశ జనాభాలో రైతులు, వ్యవసాయ కూలీలు 50 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. భారతదేశం బుద్ధిజీవుల దేశం.. బద్దూగాళ్ల దేశం కాదని స్పష్టం చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిస్తే దేశమంతా కదిలివచ్చిందని గుర్తుచేశారు. రైతులు కేవలం నాగలి దున్నేవాళ్లే కాదు.. చట్టాలు చేసేవాళ్లుగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. రైతుల్లో చైతన్యం వస్తే సర్కారు సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. నాయకులు కాదని.. ప్రజలు గెలవాలని స్పష్టం చేశారు. భారతదేశం పేద దేశం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు. అమెరికా కంటే కూడా మన దేశం సంపదత్వం గల దేశమని ఆయన అన్నారు. దేశ సంపద మొత్తం కొంతమంది చేతుల్లోకే వెళ్తుందని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లు దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలించాయని, దేశంలో వెనకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణం అని కేసీఆర్ అన్నారు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటున్నారని అన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిపోయిందన్నారు. మన్‌కీ బాత్ పేరుతో దేశాన్ని వంచిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్‌లు ఎందుకు అన్నారు. పతంగులకు కట్టే మాంజాల నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచే వస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలన్నారు. ఇది రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య అని అన్నారు.