వాణిజ్య పన్నుల ఉద్యోగుల మేలుకోరే అధికారి – ఎం. రఘునందన్ రావు

- టిసిటీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రశంసలు
హైదరాబాద్, మార్చి 12 (విశ్వం న్యూస్): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న కమిషనర్ ఎం. రఘునందన్ రావుకు వాణిజ్య పన్నుల ఉద్యోగుల మేలుకోరే అధికారిగా పేరు దక్కిందని టిసిటీఎన్‌జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వంటి అనేక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా బోధన్ చాలన్ కేసులో సంవత్సరాలుగా సస్పెండ్ అయి ఉన్న ఉద్యోగుల విషయాన్ని పరిశీలించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే చర్యలు ప్రారంభించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
రఘునందన్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు, ఉద్యోగుల్లో విశేష సంతృప్తి నెలకొన్నదని ఆయన అన్నారు. గతంలో అనేక కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాని సమస్యలను ఆయన తన సమస్యలుగా భావించి త్వరితగతిన పరిష్కరిస్తున్నారని చెప్పారు.
అలాగే పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఏసీటీఓలను గెజిటెడ్ హోదాలోకి తీసుకురావడానికి సంబంధించిన ఫైల్‌ను కూడా ముందుకు కదిలించడంలో కమిషనర్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయితే వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న 537 మంది ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా లభించే అవకాశం ఉందని తెలిపారు.
జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అధిక రెవెన్యూ వచ్చేలా అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ శాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు జీవితకాలం రఘునందన్ రావుకు రుణపడి ఉంటారని అన్నారు.