
- విశ్వసనీయ వైద్యం… సామాన్యుడికి అందుబాటులోనే!
బీబీనగర్ , ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్):ఒకప్పుడు జబ్బు పేరు వినగానే కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యేవి. కార్పొరేట్ ఆసుపత్రుల భారీ బిల్లులు చూసి పేద, మధ్యతరగతి ప్రజలు అప్పుల బారిన పడేవారు. కానీ ఇప్పుడు అలాంటి బాధలకు చెక్ పెట్టేలా తెలంగాణలోని AIIMS Bibinagar ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది.
హైదరాబాద్ – యాదాద్రి మధ్యలో 200 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ అత్యాధునిక ఆసుపత్రి ప్రజలకు ఆశాకిరణంగా మారింది. రూ.2000 కోట్లతో నిర్మితమైన ఈ సంస్థలో ఆధునిక సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, తక్కువ ఖర్చుతో చికిత్స అందుబాటులో ఉన్నాయి.
₹10కే డాక్టర్ దర్శనం: ఓపీ టికెట్ కేవలం ₹10 మాత్రమే. ఆ టికెట్‌తో జనరల్ ఫిజీషియన్‌తో పాటు కంటి, చెవి-ముక్కు-గొంతు, చర్మవ్యాధులు, దంత వైద్యం, కీళ్ల నిపుణుల వరకు పలువురు వైద్యులను సంప్రదించవచ్చు. బయట ఒక స్పెషలిస్ట్‌కు ₹500 నుంచి ₹1500 వరకు ఖర్చవుతుంటే, ఇక్కడ మాత్రం పది రూపాయలకే సేవలు అందుతున్నాయి.
తక్కువ ఖర్చుతో పరీక్షలు : రక్తపరీక్షలు, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు, ECG, ఎక్స్‌రే, థైరాయిడ్ పరీక్షలు, మామ్మోగ్రఫీ వంటి ఎన్నో పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో జరుగుతున్నాయి. దీంతో ఒకే రోజు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
హాస్పిటల్ కాదు… ఐదు నక్షత్రాల వాతావరణం: పచ్చని వాతావరణం, పరిశుభ్రత, విశాలమైన భవనాలు, శుభ్రమైన వార్డులు, ఆధునిక పరికరాలు – ఇవన్నీ కలిసి ఈ ఆసుపత్రిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. క్యాంటీన్‌లో కూడా తక్కువ ధరలకు భోజనం లభిస్తోంది.
ప్రయాణ సౌకర్యం కూడా సులభమే: ఉప్పల్ నుంచి బీబీనగర్‌కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కూడా బీబీనగర్ మీదుగా నడుస్తున్నాయి. ఉదయం వెళ్లి పరీక్షలు చేయించుకుని మధ్యాహ్నానికే తిరిగి ఇంటికి చేరుకోవచ్చు.
వేల మందికి సేవలందిస్తున్న ఎయిమ్స్ : 750 పడకలు, 250 ఎమర్జెన్సీ బెడ్లు, వందలాది వైద్యులు, నర్సులు, సిబ్బందితో ఈ ఆసుపత్రి 24 గంటలు ప్రజల సేవలో నిలుస్తోంది. ఆధార్ కార్డు ఉంటే దేశం నలుమూలల నుంచి వచ్చిన వారికీ వైద్యం అందుబాటులో ఉంటుంది.
మన ఆస్తి… మనమే వినియోగించుకోవాలి : ప్రభుత్వ ఆసుపత్రి అని చిన్నచూపు చూడకుండా, ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ ఆసుపత్రిని ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలి. కుటుంబాల్లో ఎవరికైనా వైద్య అవసరం ఉంటే ఒకసారి AIIMS Bibinagar వెళ్లి చూడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బీబీనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
ఓపీ సమయం: ఉదయం 9 గంటల నుంచి
Call: 08685293300/ 08685295050