ఉద్యోగుల అండగా ముజాహిద్ హుస్సేన్వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నుంచి ఘన సన్మానం

ఉద్యోగుల అండగా ముజాహిద్ హుస్సేన్-
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నుంచి ఘన సన్మానం

హైదరాబాద్, జూన్ 1, (విశ్వం న్యూస్): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్‌కు శాఖ ఉద్యోగులు, సంఘ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఉద్యోగుల హక్కుల సాధన, ప్రమోషన్లు, సీనియారిటీ, రోస్టర్ పాయింట్ల అమలు వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ముజాహిద్ హుస్సేన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వద్ద కూడా ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

గెజిటెడ్ హోదా సాధనలో కీలక పాత్ర : జీఎస్టీ అమలుకు అనంతరం డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్లుగా మారిన ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించేందుకు దాదాపు పదేళ్లపాటు సాగిన ఉద్యమంలో ముజాహిద్ హుస్సేన్ కీలక పాత్ర పోషించారని ఉద్యోగులు గుర్తు చేశారు. ఆయన కృషి వల్లే వందలాది మంది అధికారులకు గెజిటెడ్ హోదా దక్కిందని తెలిపారు.

మూడు దశాబ్దాలుగా ఉద్యోగుల సేవలో : రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, 2001లో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘాన్ని స్థాపించిన ముజాహిద్ హుస్సేన్ గత 30 ఏళ్లుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. సంఘాన్ని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్‌గా విస్తరించడం ద్వారా రికార్డ్ అసిస్టెంట్ నుంచి సీటీఓ స్థాయి వరకు ఉద్యోగులకు వేదిక కల్పించారని పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్‌జీవోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కూడా ముజాహిద్ హుస్సేన్ సేవలను అభినందించారు. కార్యక్రమంలో జి. గోపీకిషోర్, జి. ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, అమృతరావు, జగదీష్, రమేష్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *