తెలంగాణలో
జనసేన పోటీ చేస్తుంది

హైదరాబాద్, జూన్ 2, (విశ్వం న్యూస్) : తెలంగాణపై జనసేనకు రాజకీయాలకు అతీతమైన ప్రేమ ఉందని, రాష్ట్రంలో జనసేన విస్తరణను ఎవరూ అడ్డుకోలేరని జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై స్పందించారు.
తెలంగాణపై ప్రేమ కొత్తది కాదు: తెలంగాణపై తనకున్న ప్రేమ విభజన తర్వాత వచ్చినది కాదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముందే తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి తనను ప్రభావితం చేసిందన్నారు. రాష్ట్రంపై తనకున్న అభిమానాన్ని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
విభజన తీరునే వ్యతిరేకించా : తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానాన్ని మాత్రమే వ్యతిరేకించానన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిన తీరుపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: తెలంగాణలో జనసేన ఎందుకు పోటీ చేస్తుందని ప్రశ్నించే వారికి పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. “తెలంగాణ ఎవరి అయ్యజాగీరు కాదు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. రాష్ట్రంలో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాను” అని స్పష్టం చేశారు.
ప్రాంతీయ విద్వేషాలు మంచివి కావు : ఉపాధి అవకాశాలు, పరిశ్రమల కొరత వంటి సమస్యలకు ప్రతి సందర్భంలో ఆంధ్ర ప్రజలను బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆపాలని హితవు పలికారు.
తెలంగాణ ప్రజల ఆదరణ మరువలేను : ఏపీలో తన వారాహి యాత్రకు ఇబ్బందులు ఎదురైన సమయంలో తెలంగాణ ప్రజలు తనకు అండగా నిలిచారని పవన్ గుర్తుచేశారు. కోదాడ, నల్గొండ ప్రాంత ప్రజల మద్దతును ఎప్పటికీ మరువలేనన్నారు.
బెదిరింపులకు భయపడను : తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న పవన్, అలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందని, బెదిరింపులతో తనను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
చెరువు కబ్జా ఆరోపణలపై సవాల్ : తనపై చెరువు ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను అక్రమంగా భూమి లేదా చెరువును ఆక్రమించినట్లు నిరూపితమైతే ఆ ఆస్తిని వెంటనే ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.