ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

  • సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలి: విద్యాసాగర్ రావు

విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, మే 31: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ పేరుతో నిర్వహించిన రెండు రోజుల బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని మంజూరు చేసి యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు.

చేతివృత్తులు చేసే వారికి శిక్షణ, అవగాహన కల్పించేందుకు ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలి

తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్ రావు అన్నారు. ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. వేములవాడకు చెందిన ఆదికవి పంపకవి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ట్యాంక్‌బండ్‌పై పంపకవి విగ్రహం ఏర్పాటు చేయాలి

పంపకవి విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *