జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్

అమరావతి, జూన్ 6, (విశ్వం న్యూస్) : జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పి. హరిప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

2015 నుంచి లింగమనేని రమేష్‌కు జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్‌తో సన్నిహిత అనుబంధం ఉందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ సిద్ధాంతాలపై విశ్వాసంతో నిలిచారని తెలిపారు. శనివారం మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.

పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన వారికి కుల, మత భేదాలు చూడకుండా అవకాశాలు కల్పించడం జనసేన విధానమని, అదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పాటించారని హరిప్రసాద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *