ఎల్‌నినో ప్రభావం.. ప్రభుత్వ వైఫల్యాలపై దాసోజు విమర్శలు

హైదరాబాద్, జూలై 21 (విశ్వం న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడుతున్న వ్యవసాయ, నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వర్షాభావం, జలాశయాల్లో నీటి నిల్వల క్షీణత, ఖరీఫ్ సాగు తగ్గుదల, రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రిజర్వాయర్లు ఖాళీ.. రైతులు ఇబ్బందుల్లో : తెలంగాణలో 35 శాతం వర్షపాత లోటు నమోదైందని, ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయని దాసోజు పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని, ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. రైతులకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, రైతు భరోసా ఆలస్యం కావడం వల్ల సంక్షోభం మరింత తీవ్రతరమైందని విమర్శించారు.
హైదరాబాద్‌లో పాలనా శూన్యత : జీహెచ్ఎంసీ విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా నగరాన్ని అధికారుల పాలనకు వదిలేశారని ఆరోపించారు. నగరంలో తాగునీటి కొరత, వరద ముంపు ప్రాంతాల సమస్యలు, చెరువుల ఆక్రమణల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. హైదరాబాద్‌కు ఎన్నికైన పౌర ప్రభుత్వం లేకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి దాసోజు డిమాండ్లు : తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, కాళేశ్వరం ద్వారా నీటి నిల్వలను పునరుద్ధరించాలని, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల తేదీలను ప్రకటించాలని దాసోజు డిమాండ్ చేశారు. వ్యవసాయ, నీటి సంక్షోభంపై అసెంబ్లీలో అత్యవసర చర్చ నిర్వహించాలని కూడా కోరారు.